మావోయిస్టుల మరో డంప్ ట్రేస్…
దిశ దశ, దండకారణ్యం:
మావోయిస్టు పార్టీ ఉనికి లేకుండా పోయినప్పటికీ సరిహధ్దుల్లో బలగాలు ఇంకా జాయింట్ ఆపరేషన్లు కొనసాగిస్తూనే ఉన్నాయి. దశాబ్దాల కాలంగా కీకారణ్యాల్లో కార్యకలాపాలు కొనసాగించిన మావోయిస్టు పార్టీ పలు చోట్ల డంపులను దాచిపెట్టింది. వాటిని కూడా గుర్తించాలన్న లక్ష్యంతో మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో జాయింట్ ఆపరేషన్లు కొనసాగిస్తూనే ఉన్నారు. రెండు రోజుల క్రితం ఛత్తీస్‌గఢ్ నారాయణపూర్ జిల్లా అడవుల్లో రెండు చోట్ల డంపులను గుర్తించగా తాజాగా మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సరిహద్దుల్లో మరో డంపును గుర్తించారు. మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్ సరిహధ్దు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు దాచి పెట్టిన డంపును గుర్తించాయి బలగాలు. గడ్చిరోలి జిల్లాకు చెందిన BDDS, CRPF, Special Operations Teams అడవుల్లో గాలింపు చర్యలు చేపట్టాయి. భూమిలో పాతిపెట్టిన చోట తవ్వగా 5 నుంబి 6 టన్నుల బరువు ఉన్న లేత్ మిషన్, 150 క్లైమోర్ మైన్స్, BGL తయారు చేసేందుకు ఉపయోగించే పైపులు, 12 బోర్ పైపులు 220, రైఫిల్ రాడ్స్ కోసం సేకరించిన 20 ఇనుప కడ్డీలు లభ్యం అయ్యాయి. గడ్చిరోలి జిల్లా ఎస్పీ ఎం రమేష్, అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ కార్తీక్ మధిర, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గోకుల్ రాజ్ జీ, డీఎస్పీ ఆపరేషన్స్ విశాల్ నగర్ గోజేలు బలగాలను ప్రత్యేకంగా అభినందించారు.


