దండకారణ్యంలో ఆపరేషన్ సెర్చింగ్…

డంపుల కోసం బలగాల అన్వేషణ…

చత్తీస్ గడ్, మహారాష్ట్రాల్లో ఆయుధాలు స్వాధీనం

దిశ దశ, దండకారణ్యం:

మావోయిస్టు పార్టీ క్యాడర్ అంతా బాహ్య ప్రపచంలోకి వచ్చినా… బలగాల గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నక్సల్స్ దాచిన డంపులను గుర్తించి మందుగుండు సామాగ్రిని నిర్వీర్యం చేయడం, ఆయుధాలను స్వాధీనం చేసుకునే పనిలో బలగాలు నిమగ్నం అయ్యాయి. ఇప్పటికే పలు చోట్ల డంపులను గుర్తించిన బలగాలు తాజాగా రెండు చోట్ల ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి.

సుక్మా జిల్లాలో…

చత్తీస్ గడ్ లోని సుక్మా జిల్లాలో CRPF 50వ బెటాలియన్ బలగాలు డంప్ ల కోసం వేట చేపట్టాయి. ఈ నేపథ్యంలో భేజ్జీలోని బోధ్ రాజ్ పదర్ అటవీ ప్రాంతం నుండి బోల్డ్ యాక్షన్ రైఫిళ్లు, 47 తుటాలను స్వాధీనం చేసుకున్నాయి. CRPF DIG రాజేష్ పాండే మరియు కమాండెంట్ ప్రేమ్‌జిత్ సింగ్ నేతృత్వంలో ఈ డంప్ ను గుర్తించారు.

గడ్చిరోలిలో…

మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని మౌజా కుమ్నార్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు దాచి ఉంచిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి CRPF బలగాలు. ఇక్కడి అటవీ ప్రాంతంలో 14 తుపాకులు స్వాధీనం చేసుకున్నామని గడ్చిరోలి ఎస్పీ ఎం రమేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టేందుకు స్పెషల్ ఆపరేషన్ స్క్వాడ్ (ప్రాణహిత)కు చెందిన నాలుగు బృందాలు, ఒక BDDS, ఒక CRPF బృందాలను రంగంలోకి దింపారు. BDDS సిబ్బంది చేపట్టిన తనిఖీలో ఒక SLR తుపాకీని, మావోయిస్టు పార్టీకి సంబంధించిన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. రైఫిల్, 303 రైఫిల్, ఏడు 12-బోర్ రైఫిల్స్, మూడు సింగిల్-షాట్ రైఫిల్స్, రెండు BGL లాంచర్లు, మూడు SLR మ్యాగజైన్లు, ఒక IED, రెండు బ్యాటరీలు లభ్యం అయ్యాయి. ఈ ఆపరేషన్ లో అదనపు పోలీస్ సూపరింటెండెంట్ (ఆపరేషన్స్) కార్తీక్ మధిర, అదనపు పోలీస్ సూపరింటెండెంట్ (పరిపాలన) గోకుల్ రాజ్ జి, అహేరి (ప్రాణహిత) అదనపు పోలీస్ సూపరింటెండెంట్ పాల్గొన్నారు. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఆపరేషన్స్) సునీల్ ఉయికే పర్యవేక్షణలో డంప్ ల కోసం అన్వేషణ కొనసాగింది.