ఎన్టీపీసీ ఇస్తున్నదెంతా… కాంట్రాక్టర్లు చెల్లిస్తున్నదెంతా..?

దిశ దశ, కరీంనగర్:

రామగుండం ఎన్టీపీసీ నుండి తరలి వెల్తున్న బూడిదకు సంస్థ చెల్లిస్తున్న ఛార్జీలు ఎంత..? ట్రాన్స్ పోర్ట్ ఏజెన్సీలు ఇతర రవాణా ఏజెన్సీలకు చెల్లిస్తున్నదెంతా..? సంస్థ ఇచ్చే అద్దె కన్నా ఎక్కువ ఎలా చెల్లిస్తున్నాయి ఆ సంస్థలు..? దీని వెనక దాగి ఉన్న మర్మమేమిటీ..?

టెండర్ ప్రకారం…

రామగుండం ఎన్టీపీసీ బూడిదను 250 నుండి 300 కిలో మీటర్ల దూరంలో నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవే వద్దకు తరిలించేందుకు సంస్థ టెండర్ ద్వారా లోడింగ్ ఛార్జీలతో రూ. 3.82 క్యూబిక్ మీటర్ ఫర్ కిలోమీటర్ చొప్పున చెల్లిస్తోంది. అయితే ఎల్ 1 ఏజెన్సీలు ఎల్ 2కు రూ. 5.57 చొప్పున చెల్లిస్తుండగా ఎల్ 2 ఏజెన్సీలు లోకల్ ట్రాన్స్ పోర్ట్ ఏజెన్సీలకు రూ. 4.84 చొప్పున చెల్లిస్తున్నట్టుగా తెలుస్తోంది. సంస్థ నుండి కాంట్రాక్ట్ పొందిన రవాణా ఏజెన్సీలు సబ్ ఏజెన్సీలకు అదనంగా ఛార్జీలు భరిస్తుండడం గమనార్హం. ఎన్టీపీసీ సంస్థ ఇచ్చేది క్యూబిక్ మీటర్ పర్ టన్నుకు రూ. 3.82 అయితే సంస్థ నుండి టెండర్ దక్కించుకున్న ఏజెన్సీలు, వారి నుండి సబ్ కాంట్రాక్ట్ తీసుకున్న రవాణా సంస్థలకు అదనంగా డబ్బులు చెల్లిస్తున్నాయని తెలుస్తోంది. సాధారణంగా టెండర్ రేట్ కంటే తక్కువ రేట్ చెల్లించి సబ్ ఏజెన్సీలకు రవాణా చేసేందుకు అగ్రిమెంట్ చేస్తుంటాయి. కానీ ఎన్టీపీసీ బూడిద రవాణా విషయంలో మాత్రం సంస్థ చెల్లిస్తున్న డబ్బులకు అదనంగా ఎందుకు డబ్బులు చెల్లిస్తుండడం విశేషం. ఆయా ట్రాన్స్ పోర్ట్ ఏజెన్సీలు తమ జేబుల నుండి ఎదురు డబ్బులు చెల్లించి బూడిద రవాణా చేయడం వెనక ఉన్న ఆంతర్యం ఏంటన్నది తేల్చాల్సిన ఆవశ్యకత ఉంది.

అదే కారణమా..?

రామగుండం నుండి ఒక్కో లారీలో 32 నుండి 35 టన్నుల బూడిద మాత్రమే తరిలిపోతున్నప్పటికీ గ్రీన్ ఫీల్డ్ హైవే వరకు చేరిన తరువాత 60 టన్నులు దిగుమతి అవుతున్నట్టుగా రిసిప్ట్ లు ఎన్టీపీసీకి చేరుతున్నాయి. రామగుండంలో లారీలలో లోడ్ అయిన బూడిద గ్రీన్ ఫీల్డ్ హైవేలోని అన్ లోడింగ్ పాయింట్ల వద్దకు చేరుకునే సరికి 15 టన్నుల నుండి 18 టన్నుల వరకూ ఎక్కువ ఎలా అవుతోందన్న విషయంపై అధికారులు దృష్టి సారించాల్సిన అసవరం ఉంది. సాధారణంగా బూడిద రవాణా అవుతున్న క్రమంలో లారీల నుండి జారి కింద పడిపోవడం జరుగుతుంటుంది. దీనివల్ల లోడింగ్ పాయింట్ నుండి అన్ లోడింగ్ పాయింట్ కు చేరుకునే సరికి బూడిద మోతాదు తగ్గాల్సి ఉంటుంది. కానీ రామగుండం నుండి గ్రీన్ ఫీల్డ్ హైవేకు చేరుకుంటున్న బూడిద తూకం టన్నుల కొద్ది పెరుగుతుండడం విస్మయానికి గురి చేస్తోంది. హైవే నిర్మాణం అవుతున్న పరిసర ప్రాంతంలోని గ్రానైట్ వేస్టేజ్ ని సైట్ వద్దకు తరలిస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. తక్కువ దూరంలో ఉన్న గ్రానైట్ వేస్టేజ్ తరలించి ఎక్కువ దూరంలో నుండి రవాణా చేస్తున్న బూడిదే అని లెక్కలు చూపించి ఎన్టీపీసీ నుండి  ఛార్జీలు అదనంగా వసూలు చేసుకుంటున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. సంస్థతో ఒప్పందం చేసుకున్న తరువాత లాభమైనా నష్టమైనా ఏజెన్సీలే భరించాల్సి ఉన్నప్పటికీ… తమ నష్టాన్ని పూడ్చుకోవడంతో పాటు అదనపు లాభాలు గడించేందుకు తక్కువ బూడిదను తరలిస్తున్నా… ఎక్కువ మోతాదులో బూడిద సైట్ వద్దకు రవాణా చేశామని తప్పుడు లెక్కలు చూపిస్తున్నాయన్న విమర్శలున్నాయి. ఇలా సంస్థ నెత్తిన కుచ్చుటోపి పెట్టి మరీ దారుణంగా దోచుకుంటున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

నామామాత్రంగా…

లోడింగ్ పాయింట్ వద్ద సెక్యూరిటీతో పాటు కాంట్రాక్టు ఉద్యోగులను ఏర్పాటు చేసిన ఎన్టీపీసీ సంస్థ ఏఏ ట్రాన్స్ పోర్ట్ ఏజెన్సీలకు సంబంధించిన లారీల్లో బూడిద తరలిపోతోంది..? వాటి నంబర్లు ఇన్ ఔట్ టైం వంటి వివరాలను మాత్రమే నమోదు చేయిస్తోంది. ఇందుకు సంబంధించిన పాసింగ్ స్లిప్పులను తీసుకుని లారీలను లోపలకు అనుమతించడం, లోడ్ అయిన తరువాత బయటకు పంపించడం వంటి చర్యలకు మాత్రమే పరిమితం అవుతోంది ఇక్కడ పని చేస్తున్న యంత్రాంగం. ఏ లారీలో ఎంత మోతాదులో బూడిద లోడ్ అయిందన్న వివరాలు మాత్రం రికార్డు చేయడం లేదని సమాచారం. ఈ లెక్కన బూడిద రవాణా చేసే విషయంలో తాము కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని రామగుండం ఎన్టీపీసీ అధికారులు చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు తప్ప అక్రమ మార్గాలకు చెక్ పెట్టే విధంగా మాత్రం కాదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నిజంగానే సంస్థపై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు చొరవ తీసుకున్నట్టయితే లోడింగ్ పాయింట్ వద్దే వే బ్రిడ్జిలను ఏర్పాటు చేసి ఎంత మోతాదులో బూడిద రవాణా అవుతుందో అంత మేరకే బిల్లులు చెల్లించే వారని అంటున్నారు. కానీ ఇక్కడ మాత్రం గ్రీన్ ఫీల్డ్ హైవే అన్ లోడింగ్ పాయింట్ల వద్దకు బూడిద ఎంత మోతాదులో చేరుతుందో సర్టిఫై చేసుకుని బిల్లులు చెల్లిస్తున్నారని దీనివల్ల రవాణా ఏజెన్సీల మాయాజాలంలో ఎన్టీపీసీ చిక్కుకపోయినట్టయిందని అంటున్న వారూ లేకపోలేదు.