దిశ దశ, కరీంనగర్:
తెలంగాణలోని రామగుండం ఎన్టీపీసీ నుండి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం కోసం తరలిపోతున్న బూడిద విషయంలో సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందా..? రవాణా కోసం ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించిన సంస్థ లారీల్లో ఎంత మేర బూడిద తరలిపోతుందన్న విషయంపై ప్రత్యేక దృష్టి సారించకపోవడం వెనక కారణమేంటీ..? ఇలాంటి ఎన్నెన్నో అనుమానాలు బహిర్గతం అవుతున్నా సంస్థ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం వెనక ఆంతర్యం ఏంటన్నదే మిస్టరీగా మారింది.
వే బ్రిడ్జ్…
రామగుండం సమీపంలోని కుందనపల్లితో పాటు ఎన్టీపీసీ నుండి లారీల్లో లోడ్ అవుతున్న బూడిదను తూకం వేసేందుకు వే బ్రిడ్జిలను ఏర్పాటు చేసే విషయంలో మీనామేషాలు లెక్కిస్తున్నట్టుగా స్పష్టం అవుతోంది. గతంలో ఎప్పుడో వేసిన వే బ్రిడ్జి రామగుండంలో ఉన్నప్పటికీ అన్ లోడ్ పాయింట్ వద్ద ఉన్న వే బ్రిడ్జిల నుండి వస్తున్న సమాచారం ప్రకారం రవాణా ఛార్జీలను సంస్థ సదరు ఏజెన్సీలకు చెల్లిస్తున్నట్టుగా తెలుస్తోంది. బూడిద స్టాక్ పాయింట్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ వే బ్రిడ్జిల ద్వార తూకం వేసే విధానాన్ని అమలు చేయడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. దాదాపు 40 రోజులుగా రామగుండం నుండి నిరంతరంగా తరలిపోతున్న బూడిద రవాణా లెక్కలు ఏజెన్సీలు, గ్రీన్ ఫీల్డ్ హైవే అథారిటీ అధికారులు ఇస్తున్న ఆధారంగానే సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు బిల్లులు కూడా చకాచకా మంజూరు అవుతున్నట్టుగా సమాచారం. అయితే సంస్థ యాష్ తూకం విషయంలో చొరవ తీసుకోవడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
రూ. కోట్లలో…
ఎన్టీపీసీ నిర్ణయించిన ధరకు రవాణా ఏజెన్సీలు తక్కువ రేట్ కోడ్ చేయడంతో సంస్థకు లాభం చేకూరుతుందని భావిస్తున్నారు. కానీ లోతుపాతులు పరిశీలించినట్టయితే వాస్తవాలు వేరే విధంగా ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సగటున రోజుకు 30 నుండి 35 లారీల్లో బూడిద ఖమ్మం జిల్లా మీదుగా నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవేకు తరలిస్తున్నారు. ఇందు కోసం రవాణా ఛార్జీల రూపంలో సంస్థ కోట్లాది రూపాయలు చెల్లిస్తోంది. అయితే కుందన్ పల్లి యాష్ ప్లాంట్ నుండి కానీ ఇతర చోట్ల నుండి కానీ తరలి వెలుతున్న బూడిద ఎంతమేర వెల్తుందన్న విషయంపై ఎన్టీపీసీ అధికారులు దృష్టి సారించడం లేదు. సంస్థ తరుపునే ప్రత్యేకంగా వే బ్రిడ్జిలను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా సిబ్బందిని నియమించినట్టయితే సంస్థకు లక్షల్లోనే భారం పడనుంది. ఎంత మేర బూడిద తరలిపోతే అంతకే బిల్లులు చెల్లించే అవకాశం ఉంటుంది. తమకు ఎందుకు ఆర్థిక భారం అనుకుని ఊరుకున్నట్టయితే సంస్థ రూ. కోట్లలో నష్టపోతోందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. రామగుండం నుండి రోజుకు 900 నుండి 1200 టన్నుల బూడిద రవాణా అవుతున్నట్టుగా సమాచారం. అయితే గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం వరకు చేరుకునే సరికి ఇది 4000 నుండి 4500 టన్నుల వరకు చేరుతున్నట్టుగా రికార్డుల్లో నమోదవుతున్నట్టుగా సమాచారం. ఈ లెక్కన ఎన్టీపీసీ సంస్థ ఏ స్థాయిలో ఆర్థికంగా నష్టపోతోందో అర్థం చేసుకోవల్సిన అవసరం ఉంది.

