దిశ దశ, మంథని:
మహారాష్ట్రలో పండిన ధాన్యం తెలంగాణాకు వచ్చి చేరుతున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో దళారులు ధాన్యం అక్రమ రవాణా చేస్తున్నారు. అక్కడి రైతుల నుండి కొనుగోలు చేస్తున్న దళారులు రాష్ట్ర సరిహద్దుల్లోని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. గోదావరి వారధిగా ధాన్యం అక్రమ రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో అక్రమంగా తరలిస్తున్న ధాన్యంపై కేసులు నమోదు కావడంతో గుట్టు రట్టయింది.
ధర ఎక్కువ…
అయితే మహారాష్ట్రలోని గడ్చిరోలి, చంద్రపూర్ జిల్లాలను ఆనుకుని తెలంగాణలోని ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలు విస్తరించి ఉన్నాయి. మహారాష్ట్రలో ప్రైవేట్ మార్కెట్ లో ధాన్యానికి తక్కువ ధర పలుకుతుండగా సొసైటీల్లో మాత్రం తెలంగాణ ధరలకు కొంచెం తక్కువగా ఉంది. అయితే అక్కడ సొసైటీల ద్వారా సేకరించే ధాన్యాన్ని నిలువ చేసేందుకు చాలినన్ని వసతులు లేకపోవడంతో అక్కడ పండుతున్న పంటను అంతా విక్రయించుకునే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో సరిహద్దు ప్రాంతాల్లోని కొందరు వ్యాపారులు అక్కడి ధాన్యాన్ని కొనుగోలు చేసి తెలంగాణాలోని కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తున్నారు. గడ్చిరోలి జిల్లాలో బహిరంగ మార్కెట్ లో క్వింటాళు ధాన్యానికి రూ. 1800 వరకు పలుకుతుండగా తెలంగాణ కొనుగోలు కేంద్రాల్లో రూ. 2441లు ప్రభుత్వం చెల్లిస్తోంది. సన్నాలకు అయితే రూ. 500 బోనస్ కూడా ఇస్తోంది. అక్కడి ధాన్యం ఇక్కడ విక్రయించినట్టయితే లాభం బాగా వస్తుందని గమనించిన కొందరు మహరాష్ట్ర ధాన్యాన్ని స్మగ్లింగ్ చేస్తూ ఆదాయం గడిస్తున్నారు.
ఇప్పుడేనా..?
వాస్తవంగా గత కొన్ని సంవత్సరాలుగా మహారాష్ట్ర ధాన్యం తెలంగాణ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరపణలు ఉన్నాయి. గత సీజన్ ఈ సీజన్ లో మాత్రమే కేసులు నమోదు అయినప్పటికీ చాలా కాలంగా ఈ దందా నిర్విరామంగా కొనసాగిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. తెలంగాణకు తరలించిన తరువాత బినామీల పేరిట ధాన్యాన్ని అమ్మి సొమ్ము చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అయితే వ్యవసాయ, పౌరసరఫరాల అధికారులు కూడా ఈ అక్రమ దందాను నిలువరించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవల్సిన అవసరం ఉంది. గ్రామాల వారిగా వరి ఎంత విస్తీర్ణంలో వేశారు, ధాన్యం దిగుబడి ఏ స్థాయిలో వచ్చే అవకాశం ఉంది..? రైతులకు సంబంధించిన ఆధార్, పాస్ బుక్కుల లింక్ చేయడం వంటి విషయాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది. కొన్ని గ్రామాల్లో అయితే వ్యవసాయ భూమిని మించి ధాన్యం సేకరించినట్టుగా కూడా తెలుస్తోంది. ప్రభుత్వం కూడా లక్ష్యానికి మించి ధాన్యం సేకరించామని ప్రకటనలు చేస్తోంది. అయితే అంచనాలను మించి ధాన్యం ఎలా వస్తోంది అన్న విషయంపై ఆరా తీసినట్టయితే అక్రమ దందాకు బ్రేకు పడనుంది.

