గ్రానైట్ డస్ట్ కోసం రీ ఎస్టిమేట్ చేసిందా..?
దిశ దశ, కరీంనగర్:
రెండు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల మధ్య జరుగుతున్న లావాదేవీల తీరుపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC), గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మిస్తున్న నేషనల్ హైవే అథారిటీ (NHAI)ల మధ్య జరిగిన ఒప్పందానికి వాస్తవంగా జరుగుతున్న తీరుకు పొంతన లేకుండా పోయింది. NTPCలో పేరుకపోయిన బూడిదతో జాతీయ రహదారులు నిర్మించాలని నిర్ణయించారు. అయితే సంస్థకు భారంగా మారిపోయిన బూడిదను వినియోగించినట్టయితే అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుందని ఉన్నతాధికారులు భావించారు. కానీ ఈ రెండు సంస్థల నిర్ణయానికి అనుగుణంగా మాత్రం బూడిద రవాణా సాగడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రెండు విధాలుగా…
ఒక్కో లారీలో 32 నుండి 35 టన్నుల బూడిదను దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవేకు తరలిస్తున్నారు. అయితే నిర్మాణం వద్దకు చేరుకున్న తరువాత మాత్రం 55 నుండి 60 టన్నుల వరకూ బూడిద చేరుతున్నట్టుగా రికార్డులు తయారవుతున్నాయి. ఒక్కో లారీకి ఎన్టీపీసీ 28 నుండి 25 టన్నుల బూడిద రవాణా చేయకున్నా బిల్లులు చెల్లుస్తోంది ఎన్టీపీసీ. అయితే రవాణా కానీ బూడిదకు ఎన్టీపీసీ రెండో సారి బిల్లులు చెల్లించాల్సి వస్తుంది. దీనివల్ల రెండు విధాలుగా ఎన్టీపీసీపై భారం పడుతోంది. ఇంత జరుగుతున్నా స్థానిక ఎన్టీపీసీ అధికారులు మాత్రం బూడిద రవాణాలో జరుగుతున్న అక్రమాలకు చెక్ పెట్టకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. రోజూ కోట్లలో నష్టపోతున్నాకట్టడి చేసేందుకు చొరవ తీసుకోకపోవడం విడ్డూరంగా ఉంది.
గ్రీన్ ఫీల్డ్ హైవే…
ఇకపోతే గ్రీన్ ఫీల్డ్ హైవే అథారిటీ అధికారులు కూడా బూడిదతో పాటు గ్రానైట్ డస్ట్ కలుపుతూ రోడ్డు నిర్మాణం జరుపుతున్నారు. బూడిదతో పాటు గ్రానైట్ డస్ట్ కలిపే విషయంలో నేషనల్ హైవే అథారిటీ అధికారులు ఎస్టిమేట్లు రివైజ్ చేశారా..? ఇందుకు అనుమతులు ఇచ్చారా అన్న విషయం తేలాల్సి ఉంది. ఎస్టిమేట్ లో లేని గ్రానైట్ వేస్ట్ ను కలపడం కూడా నిబంధనలకు విరుద్దమేనన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. గ్రీన్ ఫీల్డ్ హైవే అథారిటీ, ఎన్టీపీసీ అధికారులు సమన్వయ లోపం వల్లే రవాణా కాంట్రాక్టర్లు ప్రతిపాదనలతో సంబంధం లేని గ్రానైట్ వేస్ట్ ను రోడ్డు నిర్మాణానికి తరలిస్తున్నట్టుగా స్పష్టం అవుతోంది. రవాణా కాంట్రాక్టర్లు అంతా సిండికేట్ అయి జరుపుతున్న తీరు వల్ల ఎన్టీపీసీకి తీరని నష్టం వాటిల్లుతోంది. ఈ విషయంపై ఎన్టీపీసీ, నేషనల్ హైవే అథారిటీ విభాగాలకు సంబంధించిన విజిలెన్స్ వింగ్ రంగంలోకి దిగాల్సిన అవసరం ఉంది. లేనట్టయితే ఎన్టీపీసీ వందల కోట్ల డబ్బు వృధాగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి తయారైంది. సంస్థకు అవుతున్న ఈ నష్టంతో మరి కొంత భూమిని సేకరించి యాష్ ప్లాంట్ నిర్మించుకునే అవకాశం కూడా ఉంటుందన్న విషయాన్ని గుర్తించాలి. సంస్థకు నష్టం వాటిల్లే విధంగా సాగుతున్న బూడిద రవాణా విషయంలో రెండు విభాగాలు కఠిన చర్యలు తీసుకోవల్సిన అవసరం ఎంతైనా ఉంది.

