అర్థరాత్రి సీపీ ఆకస్మిక తనిఖీలు…

నగరమంతా పర్యటించిన గౌష్ ఆలం

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ సీపీ గౌష్ ఆలం అర్థరాత్రి ఆకస్మిక తనిఖీలకు శ్రీకారం చుట్టారు. నగరంలో అర్థరాత్రి హంగామా సృష్టిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నారు. రాత్రి 11 గంటల తరువాత హోటళ్లలో క్రయవిక్రయాలు సాగుతున్నాయని, గొడవలు జరుగుతున్నాయన్న సమాచారం అందుకున్న సీపీ శనివారం అర్థరాత్రి నగరంలోని వివిధ ప్రాంతాల్లో సర్ ప్రైజ్ చెకింగ్ చేపట్టారు. కరీంనగర్ లోని శనివారం అంగడి రైతు బజార్, బైపాస్ రోడ్, రాజీవ్ చౌక్, తెలంగాణ చౌక్ తదితర ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించారు సీపీ. రాత్రి 11 గంటల తరువాత హోటళ్లు నిర్వహిస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. రైతు బజార్ లో తరుచూ కొట్లాటలు జరుగుతున్నాయన్న విషయం తెలుసుకున్న సీపీ అక్కడ ప్రత్యేక దృష్టి సారించారు. రాత్రి వేళల్లో హోటళ్లు, వ్యాపారాలు కొనసాగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. సమీపంలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్ ను తనిఖీ చేసిన సీపీ అర్థరాత్రి వరకూ మద్యం అమ్మకాలు సాగించడం ఏంటని నిలదీశారు. సదరు బార్ యజమానికి నోటీసులు ఇవ్వాలని అయినా మార్పు రానట్టయితే రెస్టారెంట్ ను సీజ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. రాజీవ్ చౌక్ లో ఓ టీస్టాల్ వద్ద ఆగిన సీపీ షాపు క్లోజ్ చేశామని హోటల్ నిర్వాహకుడు చెప్పగానే షటర్ తీసి తనిఖీ చేశారు. లోపల డికాషన్ తయారు చేస్తున్నట్టుగా గమనించి అతన్ని తీవ్రంగా మందలించారు. బైపాస్ రోడ్ లోని ఓ దాబా వద్దకు చేరుకున్న సీపీ గౌష్ ఆలం నిర్వాహకునిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల బ్లూకోట్ పోలీసులు అర్థరాత్రి దాబా నడుస్తున్నదని ఫోటోలు తీస్తే వారిని వెంటాడి బైక్ కీస్ లాక్కుని ఫోటోలను డిలీట్ చేయాలంటూ డిమాండ్ చేశారన్న విషయంపై సదరు దాబా ఓనర్ పై సీరియస్ అయ్యారు సీపీ. ఇలాగే వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవల్సి ఉంటుందని, అర్థరాత్రి దాటిన తరువాత దాబా నడిపిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి ఉంటుందని హెచ్చరించారు. తెలంగాణ చౌక్ లో కూడా తనిఖీలు నిర్వహించిన సీపీ పలువురికి హెచ్చరికలు జారీ చేసినట్టుగా సమాచారం. అయితే సీపీ ఆకస్మిక తనిఖీల గురించి కొన్ని ప్రాంతాల్లో పోలీసులు ముందే లీక్ చేయడంతో హెటళ్లను క్లోజ్ చేసుకున్నారని తెలుస్తోంది. ఆయన అక్కడి నుండి వెళ్లిపోయిన తరువాత యథావిధిగా షాపులు నడిపించినట్టుగా తెలుస్తోంది. తరుచూ ఇలాంటి ఆకస్మిక తనఖీలు చేపట్టినట్టయితే బావుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

cp karimnagarcrimeGaush Alam IPSkarimnagar newsTG NEWS
Comments (0)
Add Comment