కరీంనగర్ శివార్లలో ఏటీఎంలలో నగదు చోరీ…

దిశ దశ, కరీంనగర్ రూరల్:

కరీంనగర్ శివారు ప్రాంతాల్లో ఏటీఎంలలో నగదు ఎత్తుకెళ్లారు అగంతకులు. ఆదివారం తెల్లవారు జామున ఏటీఎం సెంటర్లలోకి చొరబడి గ్యాస్ కట్టర్లతో మిషన్లను కట్ చేసి అందులో ఉంచిన నగదును ఎత్తుకెళ్లారు.  సంఘటనా వివరాల్లోకి వెల్తే… కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్శేడు గ్రామంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఏటీఎం కేంద్రం వద్దకు ఆదివారం తెల్లవారు జామున 3.35 గంటలకు స్కార్పియోలో వచ్చిన దుండగులు గ్యాస్ కట్టర్ లతో ఏటీఎం మిషన్ ను కట్ చేసి అందులో ఉంచిన నగదును ఎత్తుకెళ్లారు. ఇదే సమయంలో ఎల్ఎండీ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్ SBI ఏటీఎంలో కూడా చోరీ జరిగింది.

స్ప్రే చేసి… 

రెండు ఏటీఎం కేంద్రాల్లో జరిగిన దొంగతనాన్ని పరిశీలిస్తే మాత్రం దొంగల ముఠా పకడ్భందీగానే వ్యవహరించినట్టుగా స్పష్టం అవుతోంది. లోపలకు చొరబడిన వెంటనే సీసీ కెమెరాలపై స్ప్రే చేసి, అలారం, సీసీ కెమెరాలకు సంబంధించిన కేబుళ్లను కట్ చేసి గ్యాస్ కట్టర్లను ఉపయోగించి మిషన్లను కట్ చేసినట్టుగా స్పష్టం అవుతోంది.

8 నిమిషాల్లోనే… 

దుర్శేడ్ ఏటీఎం కేంద్రంలోకి చొరబడిన ముఠా కేవలం ఎనిమిది నిమిషాల్లోనే దొంగతనానికి పాల్పడి పరార్ అయినట్టుగా స్పష్టం అవుతోంది. స్కార్పియో వాహనాన్ని ఏటీఎం కేంద్రం ముందు పార్క్ చేసి లోపలకు చొరబడి చకాచకా గ్యాస్ కట్టర్లతో మిషన్లను కట్ చేసి నగదు ఎత్తుకెళ్లారు.

10 నిమిషాలకు..? 

ఏటీఎం సెంటర్లలో చోరీ జరిగిన పది నిమిషాలకు ఢిల్లీ నుండి పోలీసులకు సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఏటీఎం కేంద్రాలకు చేరుకునే సరికే ముఠా అక్కడి నుండి పరార్ అయినట్టుగా తెలుస్తోంది. అలారం మోగడంలో ఆలస్యం అయిందా లేక, అప్రమత్తంగా ఉండాల్సిన బ‌ృందం ఆలస్యంగా స్పందించిందా అన్న విషయంపై స్పష్టత రావల్సి ఉంది.

రెక్కీ..?

ఏటీఎం కేంద్రాలలో నగదు చోరీ ఘటనను పరిశీలిస్తే మాత్రం దొంగలు పకడ్భందీగానే వ్యవహరించినట్టుగా స్పష్టం అవుతోంది. వినాయక నవరాత్రులు జరుగుతున్న సంగతి తెలిసిందే. గణనాథుని మంటపాల వద్ద భక్తుల రాకపోకలు అర్థరాత్రి వరకు సాగే అవకాశం ఉందని గమనించి తెల్లవారు జామున ఏటీఎంలలో నగదు ఎత్తుకెళ్లిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. అయితే దుర్శేడు, తిమ్మాపూర్ ఏటీఎం కేంద్రాల్లో చోరీకి పాల్పడింది ఒకే ముఠానా లేక రెండు బృందాలుగా విడిపోయి దొంగతనానికి పాల్పడ్డార అన్న విషయంపై పోలీసులు దృష్టి సారించారు. 

ATMcrimeLatest NewsSBITG NEWS
Comments (0)
Add Comment