ఏటీఎంలలో నగదు చోరీ కేసు…
దిశ దశ, కరీంనగర్ రూరల్:
కరీంనగర్ శివార్లలోని రెండు ఏటీఎం కేంద్రాల్లో నగదు ఎత్తుకెళ్లిన ఘటనపై పోలీసులు కూపీ లాగుతున్నారు. సాంకేతికతను అందిపుచ్చుకుని నాలుగు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు ముమ్మరంగా చేపట్టాయి. ఎల్ఎండీ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్, కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్శేడు ఏటీఎం కేంద్రాల్లో ఆదివారం తెల్లవారు జామున చోరీ జరిగింది. రూ. 15 లక్షల వరకూ ఎత్తుకెళ్లిన దొంగల ముఠా కోసం ఆరా తీస్తున్నారు. సీసీ ఫుటేజీల ఆధారంగా ముఠా వినియోగిస్తున్న స్కార్పియో వాహనం గురించి తెలుసుకునే పనిలో నిమగ్నం అయ్యారు. అయితే మహారాష్ట్రలోని చంద్రపూర్ వైపునకు ముఠా వెళ్లిపోయి ఉంటుందని నిర్దారణకు వచ్చారు పోలీసు అధికారులు.
‘‘డి’’ రూట్…
అయితే ఏటీఎంలలో చోరీకి పాల్పడిన ముఠా ‘‘డి’’ రూట్ ద్వారానే రాకపోకలు సాగించినట్టుగా అనుమానిస్తున్నారు. టోల్ ప్లాజాలను తప్పించుకునేందుకు గూగుల్ మ్యాప్ ద్వారా ప్రత్యామ్నాయ రహదారుల మీదుగా ప్రయాణం చేసినట్టుగా భావిస్తున్నారు. దీంతో కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లోని ఏ టోల్ ప్లాజా వద్ద కూడా సదరు స్కార్పియో వాహనానికి సంబంధించిన ఫుటేజ్ లభ్యం కాలేదు. అయితే స్కార్పియో వాహనానికి వేసిన నంబర్ ప్లేట్ ఆధారంగా ఆరా తీసే ప్రయత్నం చేసినప్పటికీ ఆ నంబర్ నకిలీదని పోలీసుల విచారణలో తేలింది. స్కార్పియో మాత్రం ఆసిఫాబాద్ రూట్ మీదుగానే వెళ్లినట్టుగా పోలీసు అధికారులు గుర్తించారు. దీంతో ఈ ముఠా ఖచ్చితంగా చంద్రపూర్ పరిసర ప్రాంతాలకు చేరుకుని ఉంటుందని అనుమానిస్తున్నారు.
హర్యానా గ్యాంగ్..?
ఏటీఎంలలో నగదు ఎత్తుకెళ్లిన ముఠా హర్యానా రాష్ట్రానికి చెంది ఉంటుందని అనుమానిస్తున్నారు. దాదాపు మూడు నెలల క్రితం నిజామాబాద్ ఉమ్మడి జిల్లా బాల్కొండ, మెదక్ ఉమ్మడి జిల్లాలో నెల రోజుల క్రితం ఇదే తరహాలో ఏటీఎంలలో దొంగతనాలు జరిగినట్టుగా తెలుస్తోంది. ఆయా ప్రాంతాల్లో చోరీకి పాల్పడిన ముఠా హర్యానా రాష్ట్రానికి చెందినదిగా భావిస్తున్నారు. నిజామాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాల్లో ఏటీఎంలలో నగదు ఎత్తుకెళ్లిన ఘటనలు ఒకే తరహాలో ఉందని పోలీసు వర్గాలు తేల్చాయి. దీంతో హర్యానా ముఠానే కరీంనగర్ ఏటీఎంలలో నగదు చోరీ చేసి ఉంటుందని అనుమానిస్తున్నారు.
ఏటీఎంలపై పట్టు…
ఏటిఎంలలో నగదు ఎత్తుకెళ్లే ముఠాలో మిషనరీపై పరిపూర్ణమైన అవగాహన ఉన్న వ్యక్తి ఉండి ఉంటాడని అనుమానిస్తున్నారు. క్యాష్ బ్యాక్స్ ఏర్పాటు చేసిన చోట మాత్రమే గ్యాస్ కట్టర్ల ద్వారా తొలగించి నగదు ఎత్తుకెళ్లిన తీరు, కేవలం నిమిషాల వ్యవధిలోనే చోరీ పూర్తి చేయడాన్ని బట్టి చూస్తే మాత్రం పక్కాగా ఆ ముఠాలో సాంకేతికతంగా పట్టున్న వ్యక్తి ఉండి ఉంటాడని అంచనా వేస్తున్నారు. అయితే పోలీసుల దృష్టి మరల్చేందుకు మహిళ వేషం వేసుకుని వచ్చి సీసీ కెమెరాలపై స్ప్రే చేసినట్టుగా అనుమానిస్తున్నారు.