దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ ప్రజలకు సేవలందించాల్సిన మునిసిపల్ కార్పొరేషన్ లో దళారుల ప్రమేయం ఉన్నట్టుగా ఏసీబీ నిర్దారించింది. టౌన్ ప్లానింగ్ విభాగంలో జరిపిన ఆకస్మిక తనిఖీల్లో పలు విషయాలను గుర్తించింది. మంగళవారం సాయంత్రం కరీంనగర్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగంలో కరీంనగర్ రేంజ్ ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో పలు రికార్డులను పరిశీలించిన అధికారులు ఇందుకు సంబంధించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించనున్నారు. ఈ సందర్భంగా ఆదాయ లావాదేవీలు, పెండిగులో ఉన్న దరకాస్తులతో పాటు ఇతరాత్ర కార్యకలాపాలపై ఏసీబీ అధికారులు ఆరా తీశారు. రికార్డుల పర్యవేక్షణ, నిర్వహణ, ఆదాయం వసూళ్లు, వినతి పత్రల పరిష్కారం, క్షేత్రస్థాయిలో జవాబుదారితనం తదితర అంశాలపై దృష్టి సారించిన ఏసీబీ అధికారులు కొన్ని లోపాలను గుర్తించారు. కార్పొరేషన్ కార్యాలయంలో అవసరమైన పనులు చేస్తామని డబ్బులు వసూలు చేస్తున్న దళారులను కూడా గుర్తించారు. ఆకస్మిక తనిఖీలకు సంబంధించిన సమగ్రమైన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించనున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు.