తెలంగాణ వాహనాల క్యూ…
దిశ దశ, సిరొంచ:
మహారాష్ట్రలో మళ్లీ జూదం కేంద్రం ప్రారంభం అయింది. క్లబ్ పేరిట ఏర్పడిన ఈ కేంద్రం గడ్చిరోలి జిల్లా సిరొంచ తాలుకా కేంద్ర శివార్లలో ప్రారంభం అయిన ఈ జూదం కేంద్రానికి తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన పేకాట ప్రియులు క్యూ కడుతున్నారు. మంచిర్యాల జిల్లాకు చెందిన కొంతమంది సిరొంచ ప్రాంతానికి చెందిన వారితో కలిసి ఈ క్లబ్ నిర్వహిస్తున్నట్టుగా సమాచారం. సిరొంచలో పేకాట క్లబ్ ప్రారంభం కానుందని గత కొన్ని రోజులుగా విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన పేకాటపై మక్కువ ఉన్నవారు సిరొంచకు చేరుకుంటున్నట్టుగా సమాచారం. మంచిర్యాల ప్రాంతానికి చెందిన వారు ప్రాణహిత నది మీదుగా, భూపాలపల్లి ప్రాంతానికి చెందిన వారు గోదావరి నది మీదుగా క్లబ్ కు చేరుకునేందుకు అనువుగా ఉంటుందని గమనించే సిరొంచలో క్లబ్ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. మావోయిస్టుల ఉనికి లేకుండా పోవడంతో సెక్యూరిటీ పరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం లేదని కూడా అంచనా వేసుకున్న నిర్వాహకులు జూదం కేంద్రాన్ని స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తోంది.