అక్కడ మావోయిస్టులు లేరు… అది నకిలీల పనే…

గడ్చిరోలీ ఎస్పీ ఎం రమేష్…

దిశ దశ, దండకారణ్యం:

మహారాష్ట్రలోని గడ్చిరోలి మావోయిస్టు రహిత జిల్లాగా మార్చేశామని, నక్సల్స్ ఉనికి ఏ మాత్రం లేదని ఎస్పీ ఎం రమేష్ స్పష్టం చేశారు. ఇటీవల జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో కనిపించిన బ్యానర్లు, కరపత్రాలు ప్రత్యక్ష్యం కావడంతో పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని, ఇందుకు బాధ్యులైన నకిలీ నక్సల్స్ ను అరెస్ట్ చేశామని వెల్లడించారు. ఆపరేషన్ అంతిమ్ ప్రహార్ పేరిట చేపట్టిన ప్రత్యేక గాలింపు చర్యల్లోనే మావోయిస్టులను సమూలంగా ఏరివేశామని ఇప్పుడు వారి ఉనికి జిల్లాలో అసలే లేదన్నారు. అయితే జులై 25న మావోయిస్టుల పేరిట పిప్లి, బుర్గి పోలీస్ స్టేషన్ పరిధిలో కరపత్రాలు, బ్యానర్లు ప్రదర్శించిన వారిని ఇప్పటికే అరెస్ట్ చేశామని, పుల్నార్ పోలీస్ ఔట్ పోస్ట్ పరిధిలో కూడా బ్యానర్లు, కరపత్రలు వేశారని తెలియడంతో పోలీసులు అప్రమత్తం అయిన వారి కోసం గాలించి పట్టుకున్నామని ఎస్పీ రమేష్ వివరించారు. పుల్నార్ కు 8 కిలో మీటర్ల దూరంలోని హిద్దూర్, దోబూర్ రహదారిపై చెట్లకు బ్యానర్, కరపత్రాన్ని వేలాడదీసిన కేసులో ఆరుగురిని అరెస్ట్ చేశామని తెలిపారు. BNS 353(1)(బి), 189(2), 190, మరియు 61(2) సెక్షన్లలో నమోదయిన ఈ కేసులో భామ్రాగడ్ తాలుకా మిర్గుల్వంచకు చెందిన జోగ రైను (40), మాలు కండే (42), కృష్ణార్ కు చెందిన దల్సు మర్రా తెలిమి (50), దోబూర్ కు చెందిన చైతు దుంగ ధృవ (53), పోయార్ కోఠీకి చెందిన గణేష్ దేవు (40), మిర్గుల్వంచాకు చెందిన రాజేష్ దల్లు వడ్డేలను అరెస్ట్ చేశామని ఎస్పీ ప్రకటించారు. మావోయిస్టుల పేరిట అటవీ ప్రాంతంలో భయానక వాతావరణం సృష్టించేందుకు బ్యానర్లు, కరపత్రాలు వేస్తున్నారన్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. మావోయిస్టు పేరిట కానీ నక్సల్స్ అని జరుగుతున్న ప్రచారాన్ని ప్రజలు ఎవరూ నమ్మవద్దని ఎస్పీ సూచించారు. ప్రజల్లో భయాందోళనలకు గురి చేసే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.