చిన్న నాటి స్నేహితుని ఇంట్లో చోరీ చేసిన నాయకుడు…

అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చిన పోలీసులు

దిశ దశ, కరీంనగర్:

చిన్న నాటి స్నేహితుని ఇంట్లో ఒక రోజు షెల్టర్ తీసుకునేందుకు వచ్చి నగదు ఎత్తుకెళ్లిన కేసులో మంథని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, మాజీ జడ్పీటీసీ భర్త తగరం శంకర్ లాల్ ను అరెస్ట్ చేశారు కరీంనగర్ రూరల్ పోలీసులు. కరీంనగర్ సీపీ గౌష్ ఆలం మీడియాకు ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎగ్లాస్ పూర్ కు చెందిన ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ గుడిమల్ల శ్రీనివాస్, తగరం శంకర్ లాల్ లు చిన్న నాటి స్నేహితులు. ఇటీవల కరీంనగర్ కు వచ్చిన తగరం శంకర్ లాల్ తీగలగుట్టపల్లిలోని మాణిక్వేశరీ మాతా ఆలయం సమీపంలో గుడిమల్ల శ్రీనివాస్ అద్దె ఇంట్లో ఉన్నాడు. అయితే ఆ రోజు రాత్రి అక్కడే బస చేసిన శంకర్ లాల్ తిరిగి వెళ్లేప్పుడు ఆ ఇంట్లో దాచిపెట్టిన రూ. 26 లక్షల నగదును ఎత్తుకెళ్లాడు. కుట్రపూరితంగా ఎత్తుకెళ్లిన ఈ విషయం గురించి మొదట శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అయితే ఇదే అద్దె ఇంట్లోని గ్రౌండ్ ఫ్లోర్ లో ఈ నెల మొదటి వారంలో చోరీ జరిగింది. ఈ ఘటనలో ల్యాప్ ట్యాప్ పోయిందని బాధితులు కరీంనగర్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని గుర్తించేందుకు కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు సీసీ ఫుటేజీని సేకరించడంతో పాటు ఇతర ఆధారాల కోసం అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలోనే గుడిమల్ల శ్రీనివాస్ పోలీసులను కలిసి తన ఇంట్లో కూడా చోరీ జరిగిందని రూ. 26 లక్షలు ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆరా తీసిన పోలీసులు గుడిమల్ల శ్రీనివాస్ ఇంటికి ఎవరెవరు వస్తారని తెలుసుకున్నారు. మంథని మాజీ జడ్పీటీసీ భర్త తగరం శంకర్ లాల్ పై బాధితుడు అనుమానం వ్యక్తం చేయడంతో అతన్ని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. అయితే శ్రీనివాస్ ఇంట్లో నగదు చోరీకి గురైనప్పుడు శంకర్ లాల్ మరో మహిళతో కలిసి వచ్చాడని తెలుసుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా నగదు ఎత్తుకెళ్లింది వాస్తవమేనని వాంగ్మూలం ఇచ్చింది. దీంతో శంకర్ లాల్ ను అరెస్ట్ చేసి కరీంనగర్ కోర్టులో హాజరు పర్చగా జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈ కేసులో మరో నిందితురాలు శంకరపట్నం మండలం చింతగుట్టకు చెందిన అడెపు రేష్మ పరారీలో ఉందని అమెను త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు ప్రకటించారు. నిందితుని నుండి రూ. 17.60 లక్షల నగదు, స్విప్ట్ కార్, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.

రాజకీయ కోణమేమీ లేదు…

మంథని మాజీ జడ్పీటీసీ భర్త తగరం శంకర్ లాల్ ను అరెస్ట్ చేయడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. దీని వెనక ప్రముఖల హస్తం ఉందన్న అనుమానలు వ్యక్తం అయిన నేపథ్యంలో మీడియా ప్రశ్నలకు సీపీ గౌష్ ఆలం సమాధానం ఇచ్చారు. ఈ కేసులో ఎలాంటి రాజకీయ కోణం లేదని, శంకర్ లాల్ కు మాత్రం ఆ నేపథ్యం ఉందని స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలు లభ్యం అయినందు వల్లే చట్టపరమైన చర్యలు తీసుకున్నామన్నారు. ఈ మీడియా సమావేశంలో కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్, సీఐ ఏ నిరంజన్ రెడ్డిలు పాల్గొన్నారు.

అభినందన…

కరీంనగర్ లో సంచలనం కల్గించిన మిస్సింగ్ రౌడీషీటర్ ధూం ఖాలీద్ అరెస్ట్ తో పాటు రూ. 26 లక్షల చోరీ కేసును ఛేదించడంలో సక్సెస్ అయిన కరీంనగర్ రూరల్ పోలీసులను ఈ సందర్భంగా సీపీ గౌష్ ఆలం అభినందించారు. సీపీ అభినందించిన వారిలో రూరల్ సీఐ ఏ నిరంజన్ రెడ్డి. ఎస్సై లక్ష్మారెడ్డి, కానిస్టేబుళ్లు సాగర్, అప్జల్, సల్మాన్, అనిల్, రవి, అంజయ్య, సుధాకర్ రెడ్డి, కీర్తన, సుప్రియ, శైలజ, పద్మజలకు రివార్డులు అందజేశారు.