దిశ దశ, కరీంనగర్:
ఒక్క ఫోటో ఆధారంగా నగల దుకాణం దోపిడీ దర్యాప్తు సాగుతోంది. సాంకేతికతను అందిపుచ్చుకున్న పోలీసులు దోపిడీ ముఠాను గుర్తించడంలో సఫలం అయ్యారు. ఈ రాబరీకి సూత్రధారిగా వ్యవహరించిన సుబోధ్ సింగ్ ను అరెస్ట్ చేయడంలో కూడా కరీంనగర్ పోలీసులు సక్సెస్ అయ్యారు. బేయూర్ జైలులో ఉన్న సుబోధ్ సింగ్ కు పీఎంజే జ్యువెల్లరీలో రాబరీకి ముందు గోల్డ్ చైన్ ఫోట్ తీసి పంపించాడు ముఠా సభ్యుడు. ఈ ఫోటో ఆధారంగా ఆరా తీయగా బీహార్ రాష్ట్రంలోని బేయూర్ జైలు లోకేషన్ లో ఉన్న మొబైల్ కు వెల్లిందని ట్రేస్ చేసిన పోలీసులు సుబోధ్ సింగ్ కు సంబంధించిన ఇతరాత్ర ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నం అయ్యారు. పోలీసులు చేజిక్కించుకున్న ఆధారాలను బీహార్ లోని ఆరు కోర్టులలో ప్రవేశ పెట్టడంతో అతన్ని అరెస్ట్ చేసేందుకు పర్మిషన్ ఇచ్చాయి. దీంతో కరీంనగర్ కు తరలించి అతన్ని కోర్టులో హాజరు పర్చి కస్టడీకి తీసుకున్నారు. నాలుగు రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు ఫోటోతో పాటు ఇతరాత్ర సాంకేతిక ఆదారాలను చూపిస్తూ అతన్ని ప్రశ్నిస్తున్నారు. అయితే తాను జైలులో మొబైల్ వాడింది నిజమే కానీ దోపిడీల కోసం మాత్రం కాదని తన భార్యతో మాట్లాడేందుకు మాత్రమేనని సుబోధ్ సింగ్ చెప్తున్నట్టుగా సమాచారం. తాను జైలులో ఉన్నప్పుడు దోపిడీ ఎలా చేయించగలుగుతానని ఎదురు ప్రశ్నిస్తున్న క్రమంలో పోలీసులు అతనే సూత్రధారి అని రుజువు చేసే ఆధారాల ఆధారంగా విభిన్న కోణాల్లో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకాలం తానేం చేసినా చెల్లుతుందన్న ధీమాతో ఉన్న సుబోధ్ సింగ్ కరీంనగర్ పోలీసుల విచారణ తీరుతో ఇబ్బందికర పరిస్థితులు ఎధుర్కొంటున్నట్టుగా సమాచారం. అతనితో పాటు మిగతా వారిని కూడా ప్రశ్నిస్తున్న పోలీసులు వారి వద్ద సేకరించిన సమాచారాన్ని కూడా క్రోడీకరించి సుబోధ్ సింగ్ ను విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే తనకు ఈ దోపిడీకి ఏ మాత్రం సంబంధం లేదని పదే పదే చెప్తున్న సుబోధ్ సింగ్ తన ప్రమేయం ఉందని చెప్పకనే చెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది. మరో వైపున దోపీడీకి పాల్పడిన నిందితుల్లో ఒకరు, సుబోధ్ సింగ్ గతంలో ఒకే జైలులో ఉన్నారని అప్పటి పరిచయంతోనే రాబరీలకు స్కెచ్ వేసినట్టుగా గుర్తించిన పోలీసులు ఆ కోణంలోనూ ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇన్ ఫార్మర్…
సుబోధ్ సింగ్ మొదట బీహార్ పోలీసులకు ఇన్ ఫార్మర్ గా వ్యవహరించాడని తెలుస్తోంది. అసాంఘీక శక్తుల గురించి పోలీసులకు సమాచారం అందించే పనిలో ఉన్న క్రమంలో ఓ ఎన్ కౌంటర్ విషయంలో అల్లకల్లోలం జరిగినట్టుగా సమాచారం. రాజ్యంగేతర శక్తులు పోలీసు వ్యవస్థను శాసిస్తున్నాయంటూ ఆందోళనలను చెలరేగిన క్రమంలో సుబోధ్ సింగ్ గ్యాంగ్ ఫశ్చిమ బెంగాల్ లోని కోల్ కత్తాకు వెళ్లినట్టుగా తెలుస్తోంది. అక్కడ ఉన్నప్పుడు దోపీడీలు చేయాలని ఇందుకు గోల్డ్ లోన్ ఇచ్చే సంస్థలు, బ్యాంకులు, నగల దుకాణాలను మాత్రమే లక్ష్యంగా చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. కోల్ కత్తా నుండి బీహార్ కు తిరిగి వచ్చిన తరువాత సుబోధ్ సింగ్ దోపిడీల సంస్కృతికి తెరతీసినట్టుగా సమాచారం.

