నాడు ఐపీఎస్ లకు… నేడు గ్రూప్ వన్ ఆఫీసర్లకు…

ఉమ్మడి కరీంనగర్ జిల్లా పోలీసులకు మరో క్రెడిట్

దిశ దశ, కరీంనగర్:

కేసులను ఛేదించే విషయంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా పోలీసులు తమదైన గుర్తింపు సాధించుకుంటున్నారు. నేరాలకు పాల్పడిన నిందితులను పట్టుకోవడంలో తమ చాకచక్యాన్ని ప్రదర్శించిన తీరు పోలీసు వ్యవస్థకే ఆదర్శంగా నిలిచింది. అత్యంత అరుదైన చరిత్రను ఉమ్మడి జిల్లా అందిపుచ్చుకుంది. దేశ వ్యాప్తంగా జరిగిన నేరాలు ఘోరాల్లో దర్యాప్తు చేసిన తీరు గురించి ట్రైనీ అధికారులకు పాఠాలుగా చెప్పే అవకాశం రావడం కరీంనగర్ పోలీసులకు సరికొత్త గుర్తింపును తెచ్చి పెడుతోంది. తాజాగా PMJ షాపు చోరీ కేసులో కరీంనగర్ పోలీసులు చేసిన ఇన్వెస్టిగేషన్ తీరు గురించి గ్రూప్ వన్ ట్రైనీ ఆఫీసర్లకు వివరించేందుకు ప్రత్యేకంగా సమయం కెటాయించారు.

2011లో…

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గర్దాస్ శ్రీనివాస్ హత్య కేసును ఛేదించడంలో ఆనాటి పోలీసులు సక్సెస్ అయ్యారు. మొబైల్ ఫోన్లు వాడుకలో ఉన్నప్పటికీ ఇప్పుడున్న ఆధునిక పరిజ్ఞానం అప్పుడు అంతగా లేదనే చెప్పాలి. థ్రిల్లర్ సినిమాను మరిపించే విధంగా జరిగిన ఈ హత్య కేసు గురించి సిరిసిల్ల పోలీసులు తెలంగాణతో పాటు మహారాష్ట్రలో కూడా విచారణ చేపట్టాల్సి వచ్చింది. అయినప్పటికీ కేసును ఛేదించడంతో పాటు నిందితులకు శిక్ష పడేందుకు అవసరమైన ఆధారాలు కూడా సేకరించి సఫలం అయ్యారు. రెండేళ్ల క్రితం ఈ కేస్ స్టడీకి సంబంధించిన తీరును వివరించేందుకు నేషనల్ పోలీస్ అకాడమీ(NPA)లో శిక్షణ పొందుతున్న ట్రైనీ ఐపీఎస్ లకు పాఠ్యాంశంగా బోదించారు.

మరో అవకాశం…

ఇటీవల కరీంనగర్ జిల్లా కేంద్రంలోని PMJ నగల దుకాణంలో భారీ చోరీ జరిగింది. ఎవరూ ఊహించని విధంగా కాల్పులు కూడా జరగడంతో జాతీయ స్థాయిలో సంచలనంగా మారింది. ఈ కేసులో నిందితుల ఆనవాళ్లు సీసీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించినా వారు ఎక్కడి వారోనన్నదే అంతు చిక్కకుండా పోయింది. ఈ క్రమంలో సీసీ ఫుటేజీలు, సాంకేతికతను అందిపుచ్చుకుని పోలీసులు రంగంలోకి దిగారు. మొబైల్ ఫోన్లు మార్గమధ్యలోనే విసిరేసిన ఈ ముఠాను గుర్తించడం అసాధ్యం అనుకున్నారంతా. కానీ పోలీసులకు అందిన ఒక్కో క్లూను ఆధారం చేసుకుని బృందాలుగా విడిపోయి మూడు నాలుగు రాష్ట్రాలలో గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో దోపిడీ ముఠాకు సంబంధించిన ఒక్కొక్కరిని పట్టుకోవడంలో సక్సెస్ అయ్యారు కరీంనగర్ పోలీసులు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో దోపిడీకి పాల్పడిన సుబోద్ గ్యాంగ్ PMJ నగల షాపులో దోపిడీ చేసిందని గుర్తించిన సీపీ గౌష్ ఆలం ఎప్పటికప్పుడు గాలింపు బృందాలను అప్రమత్తం చేశారు. వివిధ రాష్ట్రాల్లోని సహచర ఐపీఎస్ అధికారులతో కో ఆర్డినేట్ అవుతూ ముఠాను గుర్తించడంలో సక్సెస్ అయ్యారు. సుబోధ్ గ్యాంగ్ ఇప్పటి వరకు దోపిడీకి పాల్పడినప్పటికీ వీరికి సంబంధించిన నెట్ వర్క్ ను ఛేదించలేకపోయారు ఆయా రాష్ట్రాల పోలీసులు. కానీ కరీంనగర్ పోలీసులు మాత్రం రాబరీకి పాల్పడిన ఐదుగురు నిందితులతో పాటు దీని వెనక ఉన్న గ్యాంగ్ గురించి సమగ్రంగా తెలుసుకోవడం, వారిలో చాలా మందిని అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపు ఎనిమిదేళ్లుగా బీహార్ జైళ్లలోనే ఉంటున్న సుబోధ్ సింగ్ కరీంనగర్ కేసులో ఫిక్స్ చేసి అతన్ని విచారించేందుకు అనుమతించాలని ఆరు కోర్టుల నుండి అనుమతులు తీసుకున్నారు. అయితే ముఠా గురించి ఏ మాత్రం సమాచారం లేకున్నా పట్టుకోవడంలో సక్సెస్ అయిన తీరు గురించి వివరించేందుకు తెలంగాణ పోలీస్ అకాడమీకి కరీంనగర్ సీపీ గౌష్ ఆలం నేతృత్వంలో వెల్తోంది. ఆయనతో పాటు నిందితులను గుర్తించడం వారి కోసం వాకబు చేయడం, వారిని పట్టుకోవడంలో క్రియాశీలకంగా పనిచేసిన ఇతర పోలీసు అధికారులు తెలంగాణ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న గ్రూప్ వన్ ఆఫీసర్లకు పాఠ్యాంశంగా బోధించనున్నారు. దాదాపు 2 గంటల పాటు ట్రైనీ గ్రూప్ వన్ ఆపీసర్లకు PMJ నగల షాపు దోపిడీ తీరు, దర్యాప్తు సాగిన తీరు గురించి సమగ్రంగా వివరించనున్నారు.