దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ కాంగ్రెస్ పార్టీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పురుమళ్ల శ్రీనివాస్ సస్పెన్షన్ ఎత్తివేస్తూ పీసీసీ క్రమశిక్షణా కమిటీ ఛైర్మన్ మల్లు రవి ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ నియోజకవర్గంలో ప్రాధాన్యత లేకుండా పోయిందని డీసీసీ కార్యాలయంలో సమావేశాలు ఏర్పాటు చేయడంతో పాటు పార్టీ నాయకులపై ఆరోపణలు చేశారన్న కారణంతో ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఆయనపై కరీంనగర్ కు చెందిన పలువురు నాయకులు కూడా ఫిర్యాదులు చేశారు. దీంతో కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న శ్రీనవాస్ కు పార్టీలో రీ ఎంట్రీ లభించినట్టయింది.

వారం రోజులుగా…
గత వారం రోజులుగా పురుమళ్ల శ్రీనివాస్ సస్పెన్షన్ ఎత్తివేసే విషయంపై పీసీసీ ముఖ్య నాయకులు సమాలోచనలు జరిపుతున్నట్టుగా తెలుస్తోంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆయన విషయంలో అధిష్టానం సానుకూలంగా స్పందించింది. ఉమ్మడి జిల్లాకు చెందిన ముఖ్య నాయకులతో సమాలోచనలు చేయడంలో పురుమళ్ల శ్రీనివాస్ సఫలం అయ్యారు. జిల్లాలోని కీలక నాయకులు కూడా సస్పెన్షన్ ఎత్తివేతపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్న సంకేతాలు ఇవ్వడంతో క్రమ శిక్షణ కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. ఏది ఎమైనా పురుమళ్ల శ్రీనివాస్ రీ ఎంట్రీతో కరీంనగర్ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకున్నట్టయింది.

