నక్సల్స్ ఏరివేతలోనే కాదు… ఆదివాసీల సేవల్లోనూ…

కీకారణ్యాల్లో ఐటీబీపీ ఔదార్యం…

దిశ దశ, దండకారణ్యం:

ఆ కీకారణ్యాల్లో రహదారులు కూడా లేని ధైన్యమైన పరిస్థితులు… ఓ కుగ్రామంలో పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు వైద్య సేవలందించాల్సిన అత్యవసర పరిస్థితి. ఈ సమాచారం అందుకున్న ఆ జవాన్లు ఆదర్శ ప్రాయమైన సేవలందించారు. మావోయిస్టుల ఏరివేత కోసం వచ్చిన జవాన్లు వారి ఉనికి తగ్గిన తరువాత కూడా మాఢ్ అడవుల్లోని ఆదివాసి బిడ్డలకు సేవలందిస్తుండడం విశేషం. మావోయిస్టుల విషయంలో కఠినంగా వ్యవహరించే బలగాలు ఇక్కడి సామన్యుల కోసం మాత్రం ఔదర్యతను ప్రదర్శిస్తామని చేతల్లో చూపించారు.

ప్రభావిత ప్రాంతం…

నిన్న మొన్నటి వరకు మావోయిస్టుల కార్యకలాపాలతో అట్టుడికిపోయిన నేషనల్ పార్క్ ఫారెస్ట్ లోకి జవాన్లు వెళ్లాలంటే ప్రాణాలు అర చేతిలో పెట్టుకోవల్సిందే. మార్చి 31 నాటికి కేంద్రం డెడ్ లైన్ పెట్టిన నేపథ్యంలో భారీ సంఖ్యలో మావోయిస్టులు జనజీవనంలోకి వచ్చారు. అయితే మాఢ్, ఝార్ఖండ్ అడవుల్లో మిగిలిన మావోయిస్టుల కోసం బలగాలు ఇంకా కూంబింగ్ ఆపరేషన్లు కొనసాగిస్తూనే ఉన్నాయి. ఈ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఏర్పాటు చేసిన మందుపాతరలు ఎక్కడ ఉన్నాయో కూడా అంచనా వేయలేని పరిస్థితి. అటువంటి ప్రాంతంలో కూడా జవాన్లు గుట్టలు, కీకారణ్యాల నడుమ ఉన్న ఓ గ్రామానికి వెళ్లి గర్భిణీని వైద్య సేవల కోసం తరలించడంలో సాహసం ప్రదర్శించారు.

అభుజామడ్ అడవుల్లో…

చత్తీస్ గడ్ లోని నారాయణపూర్ అటవీ ప్రాంతంలోని బోటర్ అనే గ్రామానికి చెందిన గర్భిణీ పురిటి నొప్పులతో బాధపడుతున్నారు. రహదారులు కూడా సరిగా లేని ఈ అటవీ ప్రాంతంలో వైద్య సేవలందే పరిస్థితి కూడా లేదు. తల్లి, బిడ్డను కాపాడాలన్న తపన ఉన్నా అల్లంత దూరం తీసుకెళ్లడం ఎలా అన్న మీమాంస స్థానికుల్లో కొట్టుమిట్టాడుతోంది. ఓర్చాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు గర్భిణీని తరలించాలంటే కాలిబాట తప్ప మరో దారి లేదు. బోటర్ నుండి కడ్మెల్ సమీపంలోకి దాదాపు 5.5 కిలో మీటర్ల దూరం గర్భిణీని తరలిస్తే తప్ప అంబూలెన్స్ సేవలు అందేలా లేవు. ఈ విషయం తెలుసుకున్న ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులు (ITBP) తమలోని మానవత్వాన్ని చాటుకుని ఆదర్శంగా నిలిచారు. ఇంద్రావతి పరివాహక ప్రాంతంలోని నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో ఉన్న ఈ గ్రామానికి 29వ బెటాలియన్ కు చెందిన ITBPకి చెందిన క్విక్ రియాక్షన్ టీం (QRT) అప్రమత్తం అయింది. నారాయణపూర్ పోలీసులతో కలిసి ఐటీబీపీ జవాన్లు స్టెచ్చర్ సాయంతో గర్భిణీని కడ్మల్ వద్దకు తీసుకవచ్చి అక్కడి నుండి అంబూలెన్స్ లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తరలించారు. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.