ఉత్తరాఖండ్ మహిళ… కరీంనగర్ లో ప్రత్యక్ష్యం….

చేరదీసి శక్తి కేంద్రానికి తరలించిన పోలీసులు…

దిశ దశ, కరీంనగర్:

ఎక్కడికి చేరాలో తెలియదు… ఎటువైపు పయనించాలో తెలియదు… ఏదో వాహనం ఎక్కుతు… కరీంనగర్ చేరుకుందో అభాగ్యురాలు. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఆమె వద్ద టికెట్ కొనుగోలు చేసేందుకు డబ్బులు లేకపోవడంతో ఆర్టీసీ సిబ్బంది మార్గమధ్యలో దింపేశారు. అనామకురాలిని గమనించిన స్థానికులు కరీంనగర్ రూరల్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆమెను చేరదీసి శక్తి కేంద్రానికి తరలించారు. కరీంనగర్ రూరల్ సీఐ ఎనుముల నిరంజన్ రెడ్డి కథనం ప్రకారం… ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉదమ్ సింగ్ నగర్ జిల్లా ఖాటిమా గ్రామానికి చెందిన రూపా రాథోర్ (35) దాదాపు వారం రోజుల క్రితం కుటుంబ సభ్యులతో గొడవపడి ఇంటినుండి వెళ్లి వచ్చింది. దేశంలోని వివిధ ప్రాంతాలు తిరుగుతున్న రూపా రాథోర్ సోమవారం రాత్రి కరీంనగర్ నుండి పెద్దపల్లి వైపునకు వెల్తున్న బస్సు ఎక్కింది. అయితే ఆమె వద్ద టికెట్ కు డబ్బులు లేకపోవడంతో ఆర్టీసీ సిబ్బంది రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇరుకుల్ల వద్ద దింపేశారు. దీంతో అక్కడి బస్ షెల్టర్ లో సెద తీరుతున్న ఆమెను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఆమెను పోలీస్ స్టేషన్ కు తరలించి ఆమె కుటుంబ సభ్యుల నేపథ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు ఖాటిమాలోని కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా వారం రోజుల క్రితం ఆమె ఆచూకి కనిపించకుండా పోయిందని, సమీపంలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని కటుుంబ సభ్యులు వెల్లడించారు. రూపా రాథోర్ ను క్షేమంగా ఉంచాలని తాము ఉత్తర ప్రదేశ్ నుండి బయలుదేరుతున్నామని కుటుంబ సభ్యులు రూరల్ సీఐ నిరంజన్ రెడ్డికి వివరించారు. స్థానిక శక్తి కేంద్రానికి తరలించిన పోలీసులు ఆమె కుటుంబ సభ్యులు వచ్చిన తరువాత చట్టపరమైన అంశాలను పరిశీలించి అప్పగించనున్నామని సీఐ తెలిపారు.