దిశ దశ, దండకారణ్యం:
ఓ వైపున మావోయిస్టు పార్టీకి సంబంధించిన ఆనవాళ్లు లేకుండా చేస్తున్న బలగాలు… దాచి పెట్టిన ఆయుధాలను కూడా గుర్తించే పనిలో నిమగ్నం అయ్యాయి. నిన్న మొన్నటి వరకు మావోయిస్టులను ఏరివేయడమే లక్ష్యంగా సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగించిన బలగాలు ఇప్పుడు మావోయిస్టులు దాచిపెట్టిన ఆయుధాలు, నగదు, మందుగుండు సామాగ్రి కోసం అన్వేషిస్తున్నాయి. తాజాగా చత్తీస్ గడ్ లోని నారాయణపూర్ జిల్లాలోని కీకారణ్యాల్లో వేర్వేరు చోట్ల భూమిలో పాతిపెట్టిన ఆయుధాలను, నగదును స్వాధీనం చేసుకున్నాయి. జిల్లాలోని ఓర్చా పోలీస్ స్టేషన్ పరిధిలోని టెక్లా అటవీ ప్రాంతంలో నక్సల్స్ దాచిపెట్టిన ఆయుధాలు, సామాగ్రిని స్వాధీనం చేసుకోగా, ఛోటేడోంగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తోయమేట అడవుల్లో రూ. 24 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నాయి. ఓర్చా పొలీస్ స్టేషన్ పరిధిలోని టెక్లా అటవీ ప్రాంతంలో లభ్యమైన ఆయుధాల డంపులో INSAS రైఫిళ్లు, SLR రైఫిళ్లు, మ్యాగ్జిన్లు, 303 రైఫిళ్లు, 303 రౌండ్ల తూటాలను బలగాలు సేకరించాయి.

