TG TO CG… దండకారణ్యంలో జూదం ఆట…

156 మందిపై కేసు నమోదు…

తెలంగాణా వారే ఎక్కువ మంది..?

దిశ దశ, దండకారణ్యం:

తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో జూదం ఆడించేందుకు ఓ మాఫియా ఏర్పడినట్టుగా స్పష్టం అవుతోంది. జూదగాళ్లను చేరదీసి పెద్ద ఎత్తున నగదు లావాదేవీలు చేస్తున్నారు. తాజాగా చత్తీస్ గడ్ లోని బీజాపూర్ జిల్లా భద్రకాళీ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయగూడ అటవీ ప్రాంతంలో పోలీసులు చేపట్టిన భారీ ఆపరేషన్ తో జూదగాళ్ల గుట్టు రట్టయింది. కోడి పందాల ముసుగులో జూదం ఆడుతున్నారని బీజాపూర్ జిల్లా ఎస్పీ ఉమేష్ చంద్ర గుప్తా సమాచారం అందుకున్నారు. దీంతో అడిషనల్ ఎస్పీ రాహుల్ బన్సల్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఆపరేషన్ లో పోలీసులే పరేషన్ అయిపోయినంత పనైందని సమాచారం. రాయగూడ అటవీ ప్రాంతంలో పోలీసులు దాడులు చేయగా 156 మందిని పట్టుకోగా రూ. 20.01 లక్షల నగదు, 47 వాహనాలు, 12 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు వీరిపై జూద నిషేధ చట్టం సెక్షన్ 3 (2), పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ సెక్షన్ 4, 13 కింద క్రైం నంబర్ 6/2026లో కేసు నమోదు చేశారు భద్రకాళీ పోలీసులు.

తెలంగాణా వారే…

అయితే భద్రకాళీ పోలీస్ స్టేషన్ పరిధిలో తాజాగా అరెస్ట్ అయిన వారిలో ఎక్కువ మంది తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన వారు ఉన్నట్టుగా తెలుస్తోంది. పేకాటపై మక్కువ ఉన్నవారిని తెలంగాణ సరిహద్దు ప్రాంతాలకు చెందిన వారు సమీకరించి రాయగూడ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లినట్టుగా స్థానికంగా సమాచారం. భద్రాచలం ప్రాంతానికి చెందిన ‘‘కేటు’’ గాళ్ల ప్రమేయంతోనే సరిహద్దు అడవుల్లో జూదం ఆడిస్తున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణలో జూదం ఆడడం నిషేధం ఉండడంతో భద్రాచలం ప్రాంతానికి సమీపంలో ఉన్న రాయగూడ అటవీ ప్రాంతంలో పేకాట నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా బీజాపూర్ జిల్లా పోలీసులు జూదం కేంద్రంపై దాడులు చేయడం సంచలనంగా మారింది.