దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ లో రోజు రోజుకు రిసార్ట్స్ కల్చర్ పెరిగిపోతోంది. వీటిని అద్దెకు తీసుకుని విందులు వినోదాలు నిర్వహించుకునే సంస్కృతి కూడా సాధారణం అయింది. కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలు నిర్వహించుకోవడం కంటే ఎక్కువగా బ్యాచిలర్స్ పార్టీలకు ఇవి అడ్డాలుగా మారిపోయాయి. బర్త్ డే సెలబ్రేషన్స్ అయినా నలుగురు కలిసి నిర్వహించుకునే అకేషన్స్ అయినా రిసార్ట్స్ కేంద్రంగానే సాగుతున్నాయి. మద్యం విందులు… మందుబాబుల చిందులు… సౌండ్స్ సిస్టమ్స్ తో ఉర్రూతలూగిపోతున్నాయి చాలా రిసార్ట్స్. వీటిని బుక్ చేసుకుంటున్న వారు ఎవరూ..? వారికి అద్దెకు ఇవ్వవచ్చా లేదా అన్న విషయాన్ని విస్మరిస్తున్న నిర్వాహకులు ఆదాయమే లక్ష్యంగా నడుచుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో మైనర్లకు కూడా రిసార్ట్స్ అద్దెకు ఇస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. గతంలో కరీంనగర్ శివార్లలోని రిసార్ట్స్ లో బర్త్ డే పార్టీ జరుపుకున్న తరువాత బైక్ పై వెళ్లిన వారు ప్రమాదాలకు గురై చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఓ రిసార్ట్స్ లో పెద్దపల్లి జిల్లా పాలితంకు చెందిన అఖిల్ (21) స్విమ్మింగ్ ఫూల్ లో పడి చనిపోయాడు. అర్థరాత్రి జరిగిన ఈ ఘటనపై అనుమానస్పద స్థితిలో మరణించాడని అఖిల్ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అయితే రిసార్ట్స్ లోని సీసీ ఫుటేజీలను సేకరించిన పోలీసులు మరణానికి అసలు కారణాలు ఏంటీ అన్న కోణంలో ఆరా తీస్తున్నారు.
లిక్కర్ పర్మిషన్…
ఎక్సైజ్ నిభందనల ప్రకారం రిసార్ట్స్ లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ మద్యం పార్టీ చేసుకోవాలంటే ముందస్తు అనుమతులు తీసుకోవల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి ఛాలన్ ద్వారా డబ్బులు చెల్లించిన తరువాత పర్మిషన్ ఇస్తుంటారు ఎక్సైజ్ అధికారులు. అయితే కరీంనగర్ శివార్లలోని రిసార్ట్స్ లో మాత్రం అనుమతులు తీసుకునే విధానమే అమలు కావడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు రిసార్ట్స్ లలో జరుగుతున్న తీరు గురించి తెలుసుకున్న పోలీసులు గతంలో నోటీసులు కూడా ఇచ్చారు. అయినప్పటికీ రిసార్ట్స్ నిర్వాహకులు మాత్రం ఇష్టాను సారంగా నడుచుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అద్దెకు తీసుకుంటున్న వారి ఐడీ ప్రూఫ్స్ కూడా తీసుకోవడం లేదని తెలుస్తోంది. కరీంనగర్ పీఎంజే నగల షాపులో దోపిడీ తరువాత ప్రైవేట్ లాడ్జ్ ల్లో సోదాలు చేసి నిబంధనల ప్రకారం నడుచుకోవాలని ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇదే విధానాన్ని రిసార్ట్స్ విషయంలోనూ అమలు చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
కఠిన చర్యలు: సీఐ బిల్ల కోటేశ్వర్
కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రిసార్ట్స్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాం. గతంలో నోటీసులు జారీ చేసి నిర్వాహకులకు హెచ్చరించడం జరిగింది. ఇప్పుడు కూడా రిసార్ట్స్ నిర్వాహకులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. సొంత అవసరాలకు వినియోగించుకునే రిసార్ట్స్ కు మినహాయింపు ఇచ్చి మిగతా వాటిపై ప్రత్యేక దృష్టి సారించాం. అద్దెకు ఇచ్చే రిసార్ట్ లలో లిక్కర్ పార్టీకి ఎక్సైజ్ విభాగం నుండి పర్మిషన్ తీసుకోవాలని, రెంట్ తీసుకునే వారి ఐడీ ప్రూఫ్స్ తీసుకోవడంతో పాటు ఇతరాత్ర అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేస్తున్నాం. ఇక ముందు కూడా రిసార్ట్స్ ల్లో జరుగుతున్న తీరుపై దృష్టి సారించి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా చొరవ తీసుకుంటాం.

