What exactly is happening at the Sironcha Social Club? Are the regulations being implemented?

 

వాహనాలు ఓ చోట… జూదగాళ్లు మరో చోట

అంతా బావుంటే అలా ఎందుకో మరీ..?

దిశ దశ, సిరొంచ:

సిరొంచ తాలుకా రామంజపురంలో ఏర్పాటు చేసిన సోషల్ క్లబ్ లో కార్యకలాపాలు అన్ని కూడా సవ్యంగానే సాగినట్టయితే వాహనాలను మరోచోట ఎందుకు పార్కింగ్ చేస్తున్నారన్నదే అంతు చిక్కకుండా పోతోంది. సోషల్ క్లబ్ నిభందనల ప్రకారం ఇతర రాష్ట్రాలకు చెందిన వారి ఆదిపత్యం ఉండరాదని స్పష్టం చేస్తోంది. స్థానికులకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఈ లెక్కన ఇక్కడి సోషల్ క్లబ్ లో ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఎక్కువ ఉండడం నిబంధనలకు విరుద్దమేనన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఐడీ కంపల్సరీ…

ఇకపోతే సోషల్ క్లబ్ రిజిస్ట్రేషన్ నిభందనల ప్రకారమే ఇక్కడ క్లబ్ నిర్వహిస్తున్నట్టయితే క్లబ్ ఎంట్రన్స్ లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం వెనక ఆంతర్యం ఏంటీ..? ఇక్కడకు వచ్చే వారి నుండి రూ. 10 వేలు ఎంట్రీ ఫీ వసూలు చేసి ఫోటో ఐడీ కార్డు మెడల్ వేసి లోపలకు పంపించే సాంప్రాదాయం ఎందుకు అమలు చేస్తున్నారో అంతుచిక్కడం లేదు. మహారాష్ట్ర సోషల్ క్లబ్ రిజిస్ట్రేషన్ ప్రకారం సభ్యుల వివరాలన్ని రికార్డుల్లో ఉన్నప్పుడు క్లబ్ లోకి వచ్చే వారి నుండి ఎంట్రీ ఫీ వసూలు చేస్తుండడం నిబంధనలకు విరుద్దమేనన్న విషయం గమనించాల్సిన అవసరం ఉంది.

మూడు గంటలకు…

ఇకపోతే ఉదయం నుండి మద్యాహ్నం వరకు క్లబ్ పరిసర ప్రాంతాలన్ని ప్రశాంతంగా ఉంటే… 3 గంటల నుండి రాత్రి 11 గంటల వరకూ సందడి సందడిగా మారుతుందని తెలుస్తోంది. ఇక్కడకు చేరుకునే పేకాట రాయుళ్ల వాహనాలకు సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్ లో పార్కింగ్ కు కెటాయించినట్టుగా స్థానికులు చెప్తున్నారు. దీంతో క్లబ్ పరిసర ప్రాంతాల్లో వాహనాలేవి కనిపించకపోవడం వల్ల ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టుగా స్పష్టం అవుతోంది.

ఎర ఇలా…

తెలంగాణాలోని కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ తో పాటు పలు ప్రాంతాలకు సిరొంచ రామంజపురం క్లబ్ గురించి విస్తృతంగా ప్రచారం జరిగినట్టుగా తెలుస్తోంది. వాట్సప్ గ్రూపులను ఏర్పాటు చేసిన నిర్వాహకులు పేకాట గురించి భారీగానే ప్రచారం చేసుకుంటున్నట్టుగా సమాచారం.

వెహికిల్స్…

కరీంనగర్, వరంగల్, మంచిర్యాల తదితర ప్రాంతాల నుండి పేకాట రాయుళ్లను తరలించేందుకు వచ్చే టాక్సీలకు కూడా నిర్వాహాకులే డబ్బులు చెల్లిస్తున్నట్టుగా సమాచారం. తాము ఫలనా చోట ఉన్నామని జూదగాళ్లు సమాచారం ఇస్తే చాలు వెంటనే వారికి అక్కడిక్కడే వాహనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆయా పట్టణాల్లోని టాక్సీ డ్రైవర్లకు ఫోన్ చేసి ఫలానా వారిని తీసుకరావాలని కాంటాక్ట్ నంబర్లు కూడా షేర్ చేసేస్తున్నారు. వాహనాల సామర్థ్యాన్ని బట్టి టాక్సీ డ్రైవర్ కు రూ. 4500 నుండి 10 వేల వరకూ అద్దె చెల్లించడంతో పాటు డ్రైవర్ బత్తా రూ. 500 నుండి 1000 వరకూ చెల్లిస్తున్నట్టుగా సమాచారం. అంతేకాకుండా డ్రైవర్ కు నాన్ వెజ్ తో భోజనాలు, బోనస్ గా మద్యం బాటిల్ కూడా ఉచితంగా అందిస్తున్నారని తెలుస్తోంది.