ఏటీఎం ఎత్తుకెళ్లిన ఘటనపై పోలీసుల ఆరా…
దిశ దశ, రాజన్న సిరిసిల్ల:
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో ఏటీఎం ఎత్తుకెళ్లిన ఘటనపై పోలీసులు సెర్చింగ్ ఆపరేషన్ చేపట్టారు. సిరిసిల్ల, కామారెడ్డి ప్రధాన రహదారిపై ఉన్న ఏటీఎంనే ఎత్తుకెళ్లడాన్ని సీరియస్ గా తీసుకున్న జిల్లా ఎస్పీ మహేష్ బి గితే దొంగల ముఠాను పట్టుకునేందుకు నాలుగు స్పెషల్ టీమ్స్ ను ఏర్పాటు చేసినట్టుగా సమాచారం.
గాలింపు…
సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్ర చారితో పాటు సీఐ వెంకటేశ్, ఎస్సై రాహుల్ రెడ్డిలు ముఠా ఆచూకి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా చేపట్టారు. సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన ఫుటేజీ ఆధారంగా దుండగుల కదలికలు తెలసుకునే ప్రయత్నం చేశారు. ఎల్లారెడ్డిపేట నుండి సిరిసిల్ల జిల్లా కేంద్రం వైపు బొలేరో వాహానాన్ని తీసుకెళ్లినట్టుగా నిర్దారించారు. సిరిసిల్ల, కరీంనర్ రహదారిలో దుండగులు ప్రయాణించినట్టుగా అనుమానిస్తున్న బొలేరో వాహనాన్ని పోలీసులు గుర్తించారు. దాని ఛాసిస్, ఇంజన్ నెంబర్ ఆధారంగా దాని వివరాలు సేకరించే పనిలో పోలీసులు నిమగ్నం అయ్యారు. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం శివార్లలో బొలేరో వాహనం వదిలేసిన అగంతకులు అక్కడి నుండి మరో వాహనంలో కోనరావుపేట వైపునకు వెళ్లినట్టుగా స్పష్టం అవుతోంది. అక్కపెల్లి శివార్లలో ఏటీఎం మిషన్ ను పగలగొట్టి అందులో ఉంచిన క్యాష్ బ్యాక్సును తీసుకుని దానిని అక్కడ పడేసి వెల్లిపోయారు. గాలింపు చర్యలు చేపడుతున్న పోలీసులు అక్కపెల్లి సమీపంలో ఏటీఎం మిషన్ ను గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే మిషన్ పై వేలి ముద్రలు దొరకకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఏటీఎంలో రూ. 6 లక్షల వరకూ నగదు ఉన్నాయని బ్యాంకు అధికారులు పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఏటీఎం సెటర్ లోని సీసీ కెమెరాల్లో ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు చోరీకి పాల్పడినట్టుగా రికార్డు అయింది. అయితే బొలేరో వాహనంలో మరో ఇద్దరు ఉండి ఉంటారని అనుమానిస్తున్నారు. సిరిసిల్ల సమీపంలో బొలేరో వదిలేసి వెళ్లడంతో వారు అప్పటికే అక్కడ మరో వాహనాన్ని సిద్దంగా పెట్టుకుని ఉంటారని అనమానిస్తున్నారు. కొనరావుపేట మండలానికి చేరుకున్న తరువాత వీరు నిజామాబాద్ జిల్లాకు వెళ్ల వైపునకు వెళ్లారా లేక సిరిసిల్ల వైపునకే వెళ్లిపోయారా అన్న విషయంపై స్ఫష్టత లేకుండా పోయింది.
ఎక్కడిదో…
ఏకంగా ఏటీఎంనే ఎత్తుకెళ్లిన ఘటనపై పోలీసులు వివిధ కోణాల్లో ఆరా తీస్తున్నారు. దొంగతనానికి పాల్పడిన ముఠా ఇతర రాష్ట్రాలకు చెందినదై ఉంటుందని అనుమానిస్తున్నారు. రాజస్థాన్ లేక వేరే రాష్ట్రానికి చెందిన ముఠాలే బ్యాంకులు, ఏటీఎంలు లక్ష్యంగా చేసుకుని దోపిడీకి పాల్పడే అవకాశం ఉందని గతంలో ఉమ్మడి జిల్లాలో జరిగిన ఘటనలు స్ఫష్టం చేస్తున్నాయి. ఎల్లారెడ్డిపేట ఏటీఎంను ఎత్తుకెళ్లింది కూడా అలాంటి ముఠాలే అయి ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో ఏటీఎంలలో దొంగతనాలకు పాల్పడిన ముఠాల గురించి కూడా వాకబు చేస్తున్నట్టుగా సమాచారం. అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మొబైల్ టవర్ల ఆధారంగా అనుమానిత నెంబర్లను గుర్తించే పనిలో నిమగ్నం అయినట్టుగా తెలుస్తోంది.