రూ. 198 కోట్లతో పునర్నిమాణం…
దిశ దశ, కాళేశ్వరం:
ప్రపంచంలోనే అత్యంత అరుదైన క్షేత్రాల సరసన నిలిచే కాళేశ్వర క్షేత్రం మరోసారి పునర్నిమాణానికి నోచుకోబోతోంది. శతాబ్దాల చరిత కలిగిన కాళేశ్వరం కీకారణ్యాల్లో ఉండడంతో శిథిలాస్థకు చేరుకుంది. 1970వ దశాబ్దంలో ఈ ఆలయాన్ని జీర్ణోద్దారణ చేసి ఆనాటి అంచనాల ప్రకారం వసతులు కల్పించారు. అయితే ఇటీవల కాలంలో కాళేశ్వరం క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య తీవ్రంగా పెరిగిపోతోంది. రవాణా సౌకర్యాలు మెరుగు పడడంతో పాటు ఈ క్షేత్రం గురించి విస్తృతంగా ప్రచారం జరుగుతుండడంతో భక్తుల రద్దీ పెరుగుతోంది. దీంతో కాళేశ్వరం ఆలయాన్ని అభివృద్ది చేయాలని నిర్ణయించారు మంథని నుండి శాసనసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తరువాత సరస్వతి పుష్కరాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. నిధులు భారీగా మంజూరు చేయించారు. అయితే వచ్చే సంవత్సరం గోదావరి నది పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో ఆలయానికి భక్తుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కాళేశ్వరం ఆలయాన్ని ఆధునిక హంగులతో అభివృద్ది చేయాలని సంకల్పించి ఈ మేరకు రూ. 198 కోట్లు మంజూరు చేసింది ప్రభుత్వం.
మారనున్న రూపు రేఖలు…
కాళేశ్వరం ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ ఆలయాల రూపు రేఖలను మార్చాలని నిర్ణయించారు దేవాదాయ అధికారులు. శృంగేరీ పీఠం దిశానిర్దేశంలో ఆలయ ప్రాంగాణమంతా కొత్త హంగులు సంతరించుకోనున్నాయి. ఇందు కోసం దేవాదాయ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ నేతృత్వంలో దేవాదాయ శాఖ స్పెషల్ కేర్ తీసుకుంటోంది. మంగళవారం దేవాదాయ శాఖ కమిషనర్ కాళేశ్వరంలో సమీక్ష నిర్వహించారు. గోదావరి నది తీరంలో పుష్కరఘాట్ల నిర్మాణంతో పాటు ఇతరాత్ర భవనాల నిర్మాణం చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్దం చేశారు. మాస్టర్ ప్లాన్ అంతా సిద్దం చేసిన అధికారులు శాస్త్రోక్తంగా కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.
‘‘ఆది’’కి శోభ…
కాళేశ్వరం క్షేత్రంలో ఒకే పానవట్టంపై రెండు లింగాలు వెలియక ముందు సమీపంలోని అటవీ ప్రాంతంలోనే ముక్తీశ్వర ఆలయంలోనే భక్తులు పూజలు చేసేశారు. ఈ ఆది ముక్తీశ్వరాలయం గురించి నేటి తరానికి అంతగా తెలియదనే చెప్పాలి. నాసికా రంధ్రాలతో వెలిసిన ఆది ముక్తీశ్వరాలయానికి వెళ్లే భక్తుల సంఖ్య కూడా అంతంత మాత్రమే. అయితే యముడు, శివుడు వెలిసి కాళేశ్వరం ప్రధాన ఆలయ పునర్నిమాణం కారణంగా ఇక నుండి ఆది ముక్తీశ్వరాలయాన్ని సందర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. బాలాలయాన్ని ఏర్పాటు చేసిన తరువాత భక్తులు ఆది ముక్తీశ్వరున్ని సందర్శించుకోవల్సి ఉంటుంది. కాళేశ్వరం క్షేత్రం పునర్నిమాణంతో మరుగునపడిపోయిన ఆది ముక్తీశ్వరాలయం నిత్య పూజలతో అలరారనుంది. ఇక నుండి భక్తులు కూడా పెద్ద సంఖ్యలో అక్కడికే చేరుకోనున్న నేపథ్యంలో ఆది ముక్తీశ్వరుని చరిత్ర కూడా నేటి తరానికి తెలియనుంది.