జగిత్యాల రాజకీయ ముఖ చిత్రం
దిశ దశ, జగిత్యాల:
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు… శాశ్వత మిత్రులు ఉండరన్న నానుడికి తగ్గట్టుగా సాగుతున్నాయి ఆ జిల్లాలో పాలిటిక్స్. నిన్న మొన్నటి వరకూ ఒకరికొకరు వెన్నుదన్నుగా నిలిచిన ఆ నేతల మధ్య ఇప్పుడు డైలాగ్ వార్ సాగుతోంది. ఆ సీనియర్ నేత అలా పార్టీ మారారో లేదో ఇలా తన శిష్యులపై విరుచుకపడుతున్నారు. పెద్దాయన అని ఇంతకాలం మౌనంగా ఉన్న ఆ శిష్యులు కూడా ఆయనపై ఎదురు దాడికి శ్రీకారం చుట్టారు. ఇంతకాలం ఒకే జెండా కింద పనిచేసిన ఆనేతల మధ్య సాగుతున్న మాటల యుద్దం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
నాడు గెలుపు కోసం…
తెలంగాణాలోనే అత్యంత సీనియర్ నాయకుల్లో ఒకరైన తాటిపర్తి జీవన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో నెలకొన్న పరిణామాలపై కినుక వహించి పార్టీ మారారు. నాలుగు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఆయన ఇప్పుడు గులాభి కండువా కప్పుకున్నారు. అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా బరిలో నిలిచిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మేడిపల్లి సత్యంలకు అండగా నిలిచారు. అధికారంలోకి రాకముందు వారి నియోజకవర్గాల్లో కూడా సమీకరణాలు నెరిపి తనవంతు బాధ్యతలను నిర్వర్తించారు జీవన్ రెడ్డి. ఇదే జిల్లాకు చెందిన అడ్లూరి, మేడిపల్లిలు కూడా జీవన్ రెడ్డి అంటే అపారమైన గౌరవాన్ని చూపించేవారు. సీనియర్ నేతగా ఆయనకు ప్రాధాన్యత ఇచ్చేవారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు చొప్పదండి నియోజకవర్గంలో చేపట్టిన నిరసన కార్యక్రమానికి హాజరైన జీవన్ రెడ్డి అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. ఆయన ఇంటి నిర్మాణం గురించి జీవన్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అదే జీవన్ రెడ్డి నోట మేడిపల్లికి వ్యతిరేకమైన వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
వారే టార్గెట్…
తాజాగా జీవన్ రెడ్డి ప్రధాన టార్గెట్ గా ధర్మపురి ఎమ్మెల్యే, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మేడిపల్లి సత్యంలే లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా మంత్రి అడ్లూరిపై మాజీ మంత్రులు జీవన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ లు ఆరోపణలు చేస్తున్నారు. దీంతో మంత్రి లక్ష్మణ్ కుమార్ కూడా తనదైన స్టైల్లో కౌంటర్ అటాక్ స్టార్ట్ చేశారు. తనపై చేసిన ఆరోపణలు రుజువు చేస్తే పదవికి రాజీనామా చేస్తానంటూ అడ్లూరి సవాల్ విసిరారు. జగిత్యాల, ధర్మపురి, చొప్పదండి నియోజకవర్గాల్లో తనకున్న పట్టును నిరూపించుకుని గులాభి జెండా రెపరెపలాడించాలని జీవన్ రెడ్డి వ్యూహాలు పన్నినట్టుగా స్పష్టం అవుతోంది.
ఒక్కరి కోసం…
జీవన్ రెడ్డి ప్రధానంగా జగిత్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిన తీరును అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కారణంగానే ఆయన సీఎం రేవంత్ రెడ్డి వైఖరిని తప్పు పట్టారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు వచ్చి ఆయనతో చర్చలు జరిపినా పార్టీ మారి తీరుతానని స్పష్టం చేశారు. డాక్టర్ సంజయ్ కుమార్ ను పార్టీకి దూరంగా ఉంచాలన్న ఏకైక డిమాండ్ వినిపించారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రం జీవన్ రెడ్డి నిర్ణయానికి అనుకూలంగా వ్యవహరించలేదు. దీంతో ఆయన కారెక్కి కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం ఆరంభించారు. ఈ నేపథ్యంలోనే ధర్మపురి, చొప్పదండి సిట్టింగులపై గురి పెట్టి విమర్శలు చేస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో ఉత్తములుగా కనిపించిన ఈ ఇద్దరు నాయకులు ఇప్పుడు తప్పు చేసే వారిగా కనిపిస్తున్నారా అన్న చర్చ కూడా సాగుతోంది. జీవన్ రెడ్డి చేస్తున్నవిమర్శల తీరుపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంలను ఆలోచనలో పడేస్తోంది. పెద్దాయనగా ఎంతో గౌరవించిన తమపై ఇలా మాట్లాడుతున్నారేంటని ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. జీవన్ రెడ్డి తీరు ఇకముందు కూడా ఇలాగే కొనసాగితే మాటల యుద్దం మరింత తీవ్రం రూపం దాల్చే అవకాశం లేకపోలేదు. ఏది ఏమైనా నిన్న మొన్నటి వరకూ నా వాళ్లు అని బాహాటంగా ప్రచారం చేసిన జీవన్ రెడ్డి ఇప్పుడు వారిపైనే ఆరోపణలు చేస్తున్న తీరు సరికొత్త చర్చకు దారి తీస్తోంది.