తీగ లాగారు… డొంక కదులుతోంది… జ్యూవెలరీ రాబరీ కేస్…

మరోకరి అరెస్ట్… ఆయుధం స్వాధీనం…

దిశ దశ, కరీంనగర్:

మే 3వ తేదిన కరీంనగర్ PMJ జ్యూవెలరీ షోరూం దోపిడీ కేసులో పోలీసులు ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నారు. దోపిడీకి పాల్పడిన ముఠా గురించి తీగ లాగితే డొంక కదలినట్టుగా అయింది. ఇంతకాలం దర్జాగా రాబరీలు చేయిస్తున్న ముఠా గుట్టును విప్పడంలో కరీంనగర్ పోలీసులు సక్సెస్ అవుతున్నారు. ఈ దోపిడీ కేసుతో మొత్తం 13 మందికి సంబంధాలు ఉన్నాయని ప్రాథమికంగా తేల్చిన పోలీసులు ఇప్పటి వరకు ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు.

తుపాకీ స్వాధీనం…

దోపిడీలో ప్రత్యక్ష్యంగా పాల్గొన్న ఐధుగురు నిందితుల్లో ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేయగా తాజాగా మరోకరిని కూడా అరెస్ట్ చేశారు. సూర్యమణి అలియాస్ సనోజ్ కుమార్ (21)ని అదుపులోకి తీసుకున్న పోలీసులు కరీంనగర్ కోర్టులో హాజరు పరిచారు. సనోజ్ కుమార్ ఇచ్చిన సమాచారం మేరకు రామడుగు శివార్లలోని ఎస్సారెస్పీ కెనాల్ వద్ద తాత్కాలిక నిర్మాణ షెడ్ లోపల దాచిపెట్టిన ఐదు జతల దుస్తులు, మూడు జతల షూస్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదే ప్రాంతంలోనే పెట్టిన పిస్టల్, ఓ మ్యాగజైన్, మూడు బైక్స్ కు సంబంధించిన నకిలీ ఆర్సీ కార్డులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మరో నిందితుడు…

మరో వైపున కరీంనగర్ పోలీసులు దోపిడీతో ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా ప్రమేయం ఉన్న నిందితుల కోసం వేటాడుతూనే ఉన్నారు. బిహార్ లోని పాట్నా జిల్లా పుల్వరి షరీప్ వద్ద మరో నిందితుడు ఆదిల్ ఖాన్ ను కరీంనగర్ పోలీసులు అదుపులోకి తీసుకుని ట్రాన్సిట్ వారెంట్ ద్వారా కరీంనగర్ కు తరలించే పనిలో నిమగ్నయ్యాయి పోలీసు బృందాలు. ఇటీవల అరెస్ట్ అయిన కార్ డ్రైవర్ జైనుల్ అబ్దిన్ కు క్రెటా కారుతో పాటు, తుపాకులను మహ్మద్ ఆదిల్ సమకూర్చినట్టుగా పోలీసుల విచారణలో తేలింది.

ముగియనున్న కస్టడీ…

ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన సుబోధ్ సింగ్, రఘునాథ్, రావిష్, అమర్ సింగ్, జైనుల్ అబ్దిన్ లను ఆరు రోజుల పాటు విచారించేందుకు కోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. అయితే కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో మెహతాబ్ ఖాన్ ను కస్టడీకి తీసుకోలేదు. ఇతను సిమ్ కార్డులను మాత్రమే విక్రయించినట్టుగా తేలడంతో అరెస్ట్ చేసి జైలుకు తరించారు. దోపిడీల స్కెచ్ తో పాటు ఇతరాత్ర వ్యవహారాలలో ఇతని ప్రమేయం లేదని గుర్తించారు. దీంతో పోలీసులు ఐధుగురిని మాత్రమే కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకుని విచారించారు. మంగళవారంతో వీరి కస్టడీ ముగియనున్నందున ఆరుగురిని కోర్టులో హాజరు పర్చి జైలుకు తరలించనున్నామని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం వెల్లడించారు.

బైక్ ట్రేస్…

ఆరు రోజుల పాటు విచారణ జరిపిన పోలీసు బృందాలు రావిష్ సింగ్ ఇచ్చిన సమాచారంతో బైక్ ను స్వాధీనం చేసుకున్నాయి. ధర్మపురి నుండి కరీంనగర్ కు, ఇక్కడి నుండి జిల్లా సరిహద్దులు దాటిపోయేందుకు వినియోగించిన మరో వాహనాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ధర్మపురి శివరాల్లో నిందితుల కోసం గాలింపు చేపట్టినప్పుడు ఓ బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా అపాచీ బైకును మహారాష్ట్రలోని బల్లార్షా రైల్వే స్టేషన్ సమీపంలో స్వాధీనం చేసుకున్నారు.

వెల్ డన్: సీపీ గౌష్ ఆలం…

పీఎంజే జ్యువెల్లరీ కేసు ఛేదించడంలో సక్సెస్ అవుతున్న కరీంనగర్ పోలీసు బృందాలను సీపీ గౌష్ ఆలం ప్రత్యేకంగా అభినందించారు. నిందితులను గుర్తించి పట్టుకోవడంతో పాటు వారిని విచారించి దోపిడీకి ఉపయోగించిన వాహనాలు, ఆయధాలను స్వాధీనం చేసుకోవడంలో క్రియాశీలకంగా పని చేస్తున్నారన్నారు. మిగతా నిందితులను పట్టుకోవడంలో కూడా ఇదే స్థాయిలో స్పూర్తిని ప్రదర్శించాలన్నారు.

karimnagar newsPMJ Jewellery ShowroomRobbery GangSubodh Singh gangTG NEWS
Comments (0)
Add Comment