సిరొంచ కేంద్రంగా జిల్లా ఏర్పాటుకు డిమాండ్…

ఉద్యమం కోసం సన్నాహాలు… 

 

దిశ దశ, కరీంనగర్: 

బ్రిటీష్ కాలంలో జిల్లాగా ఉన్న ఆ ప్రాంతాన్ని గుర్తించాలన్న డిమాండ్ మొదలైంది. ఇప్పుడు కూడా జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. గత వైభవానికి ప్రతీకగా నేటీకి అక్కడ అద్దాల మేడ సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. మారుమూల ప్రాంతంగా ఉన్న సిరొంచ కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు  చేయాలని స్థానికులు కోరుతున్నారు. కొద్ది రోజులుగా ఈ మేరకు సమీకరణాలు నెరుపుతున్నారు. ఈ మేరకు వినతి పత్రాలు తయారు చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కు పంపించే యోచనలో ఉన్నారు. జిల్లాగా ప్రకటించే వరకూ ఉద్యమించాలన్న అభిప్రాయాన్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. 

బౌగోళికంగా… 

ప్రస్తుతం గడ్చిరోలి జిల్లాలో ఉన్న సిరొంచ తాలుకా కేంద్రం నుండి జిల్లా కేంద్రానికి 200  కిలోమీటర్ల దూరం ఉంది. తాలుకాలోని చివరి గ్రామం నుండి అయితే 256 కిలో మీటర్ల మేర దూరం అవుతోంది. ఆదివాసీలు ఎక్కువ శాతం ఉన్న సిరొంచను ప్రత్యేక జిల్లాగా గుర్తించినట్టయితే అన్నింటా అభివృద్ది సాధ్యమవుతుందని స్థానికులు అంటున్నారు. నేటికీ రవాణా సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్న గ్రామాలు ఎన్నో ఉన్నాయని, విద్య, వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు స్థానికులు. గడ్చిరోలి దక్షిణ జిల్లాలోని అహేరీ, ఏటపల్లి, భామ్రాఘడ్, సిరొంచ తాలుకాలను కలిపి కొత్త జిల్లాను ఏర్పాటు చేయడం వల్ల పరిపాలనపరమైన అవాంతరాలు తొలిగిపోతాయని చెప్తున్నారు. తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్ గడ్ సరిహద్దులో ఉన్న సిరొంచను జిల్లాగా ప్రకటించినట్టయితే అన్ని విధాలుగా సౌలభ్యంగా ఉంటుందని స్థానికులు వాదిస్తున్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కావడంతో అభివృద్దికి నోచుకోని గ్రామల రూపు రేఖలు మారిపోతాయని సిరొంచ వాసులు అంటున్నారు. గతంలో కూడా సిరొంచ జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాలు జరిగాయని ఈ సారి మాత్రం మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగాలని భావిస్తున్నారు. గడ్చిరోలి జిల్లా ఇంఛార్జి మంత్రిగా కూడా సీఎం ఫడ్నవిస్ వ్యవహరిస్తున్నందున తమ గళాన్ని వినిపించినట్టయితే సక్సెస్ అవుతామన్న అభిప్రాయంతో ఉన్నారు స్థానికులు. 

నాడు…. 

1997లో కూడా సిరొంచ వాసులు భారీ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.  ‘‘విభజన్ కరో… వికాస్ కరో’’ అన్న నినాదంతో తాలుకా వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. మారుమూలగా ఉన్న సిరొంచను పాలకులు పట్టించుకోవడం లేదని దీంతో అభివృద్ది విషయంలో తాము వెనకబడిపోయామని వాపోయారు. తమ ప్రాంతానికి పొరుగునే ఉన్న మహాదేవపూర్, మంథని, చెన్నూరులతో సంబంధాలు ఎక్కువగా ఉన్నాయని, తమ పూర్వీకులు కూడా ఆయా ప్రాంతాలకు చెందిన వారే అయినందున తమను ఏపీలో కలిపినట్టయితే బావుంటుందన్నారు. తీవ్ర రూపం దాల్చిన ఈ ఉద్యమం గురించి తెలుసుకున్న అప్పటి ప్రభుత్వం ప్రత్యేకంగా మంత్రులను పంపించి అభివృద్ది చేసేందుకు ముందుకు వచ్చింది. ఇప్పుడు కూడా జిల్లా కేంద్రంగా సిరొంచను చేసినట్టయితే ఆయా తాలుకాలకు చెందిన వారికి ఎంతో సౌలభ్యంగా ఉంటుందని అంటున్నారు. ఇప్పటికీ ఎక్కువగా వరంగల్, హైదరాబాద్ నగరాలకు రాకపోకలు సాగిస్తుంటామని సిరొంచను జిల్లా కేంద్రంగా ప్రకటించడం వల్ల అన్ని తాలుకాలకు ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుందని అంటున్నారు. 

Latest Newsnational newsNEW DISTRICTsironchaTG NEWS
Comments (0)
Add Comment