దిశ దశ, హైదరాబాద్:
ఆయన ఇంట్లోనే ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులు, నగదు లభ్యం అయితే ఆ రెండు లాకర్లలో ఏ స్థాయిలో దోరుకతాయోనన్న చర్చ మొదలైంది. సర్వే ‘‘సెటిల్ మెంట్’’, ల్యాండ్ రికార్డ్స్ విభాగం డిప్యూటీ డైరక్టర్ సుంకరి నరహరి రావు అక్రమ ఆదాయం చిట్టా విప్పితే ఏఏ స్కాం బయటపడనుందోనన్న అనుమానాలు మొదలయ్యాయి.
కప్ బోర్డులో కట్టలే కట్టలు…
సుంకరి నరహరి రావు ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారన్న అభియోగంపై తెలంగాణ ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు డీఎస్పీ గంగసాని శ్రీధర్ నేతృత్వంలో ఏక కాలంలో 12 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. అయితే నరహరి రావు ఇంట్లో లభ్యమైన అక్రమ ఆస్తుల వివరాలు చూసిన అధికారులు ఆశ్యర్యానికి గురయ్యారు. బెడ్ రూంలోని బీరువాపై ఉన్న కప్ బోర్డును ఓపెన్ చేయడంతో నోట్ల కట్టల సంచులు బయటపడ్డాయి. సంచుల్లో ఉన్న రూ. 500ల నోట్లను లెక్కించగా రూ. 1.54 కోట్లు బయటపడ్డాయి.
ప్రైమ్ లొకేషన్…
డిప్యూటీ డైరక్టర్ నరహరి రావు వద్ద లభ్యమైన ఆస్తుల తాలుకూ డాక్యూమెంట్లను పరిశీలించగా ఆయన స్థిరాస్థులు అన్ని కూడా హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాల్లోనే ఉండడం గమనార్హం. మహేశ్వరంలో 24 గుంటల వ్యవసాయ భూమి, రంగారెడ్డి జిల్లాలో ఐదు ఓపెన్ ప్లాట్లు, పుప్పాలగూడలో హైరైజ్ భవనంలో 2500 చదరపు అడుగుల ఫ్లాట్, నార్సింగిలో 1860 చదరపు అడుగుల ఫ్లాట్లు రెండు, రాజేంద్రనగర్ లో 1377 చదరపు అడుగుల ఫ్లాట్, గచ్చిబౌళిలోని TNGO కాలనీలో జీ ప్లస్ 2 భవనం, 1.3 కిలోల బంగారు ఆభరణాలు 8 కిలోల వెండి వస్తువులను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకుల్లో రూ. 5.04 కోట్ల ఫిక్స్ డిపాజిట్లు, వివిధ బ్యాంకుల ఖాతాలలో రూ.2.29 కోట్లు ఉన్నాయని గుర్తించారు. ఇప్పటి వరకు లభ్యమైన ఆస్తులు, నగలు, నగదు విలువ రూ. 13.05 కోట్ల విలువ రికార్డుల ప్రకారం ఉండగా బహిరంగ మార్కెట్ లో వంద కోట్లపైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు.
రెండు లాకర్లు…
కేవలం ఆయనకు సంబంధించిన ఇండ్లతో పాటు ఆఫీసులో లభ్యమైన ఆస్తులే కాకుండా భార్య పేరిట రెండు లాకర్లు ఉన్నట్టుగా గుర్తించారు. వీటిని ఓపెన్ చేసినట్టయితే మరిన్ని విలువైన ఆస్తులు బయటపడే అవకాశాలు ఉన్నాయని అనుమానిస్తున్నారు.
అక్రమాలు ఎలా..?
ల్యాండ్ సర్వే సెటిల్ మెంట్, రికార్డ్స్ విభాగానికి సంబంధించిన నరహరి రావు అక్రమ ఆదాయం ఏఏ సెటిల్ మెంట్లలో వచ్చిందన్నది కూడా తేల్చాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. భూములకు సంబంధించిన సర్వే అధికారికంగా చేసే విషయంలో ఆయన ఏ స్థాయిలో తప్పడగులు వేసి ఉంటారోనన్న చర్చ సాగుతోంది. ఆయన సాధారణ వ్యక్తులకు సంబంధించిన భూముల సెటిల్ మెంట్లలో జోక్యం చేసుకున్నారా లేక ప్రభుత్వ భూములకే ఎసరు పెట్టారా అన్నది తేల్చాల్సిన అవశ్యకత సదరు విభాగంపై ఉంది. ఆయన చేసిన సెటిల్ మెంట్ల తాలుకు ఫైళ్లను పరిశీలించినట్టయితే శాఖపరంగా జరిగిన తప్పిదాలు కూడా బహిర్గతం అయ్యే అవకాశాలు ఉన్నాయి.