దిశ దశ, మంథని:
మంత్రకూట వేమన, ప్రజాకవి, రావికంటి రామయ్య గుప్త 90వ జయంతి వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. మంథనిలోని వారి కాంస్య విగ్రహానికి పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. మంథని మున్సిపల్ ఛైర్మన్ ఒడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ సహేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు శశి భూషణ్ కాచే, ఆర్య వైశ్య మహాసభ రాష్ట్ర కార్యదర్శి కొమురవెల్లి విజయ్ కుమార్, ఆర్య వైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు ఎల్లంకి వంశీధర్ , రావికంటి రామయ్య తనయుడు, సీనియర్ జర్నలిస్ట్ రావికంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంథని విద్యార్థి యువత వ్యవస్థాపకుడు కొండేల మారుతి ఆధ్వర్యంలో రావికంటి రామయ్య గుప్త సంస్మరణ సభ జరిగింది. ఆర్య వైశ్య మహాసభ రాష్ట్ర కార్యదర్శిగా ఇటీవల నియమితులైన కొమురవెల్లి విజయ్ కుమార్ ను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు.
రామయ్య కీర్తి అజరామరం : మున్సిపల్ ఛైర్మన్ ఒడ్నాల శ్రీనివాస్
కవిత్వం, సాహిత్యం ద్వారా ప్రజలను చైతన్య పరిచిన రావికంటి రామయ్య కీర్తి అజరామరంగా నిలిచిపోతుందని మంథని మున్సిపల్ ఛైర్మన్ ఒడ్నాల శ్రీనివాస్ అన్నారు. ప్రజాకవిగా పేరొందిన ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ఆర్య వైశ్య సంఘం నిర్వహించడం హర్షణీయమని ఆయన అన్నారు.
మహామహుల నిలయం మంథని
మంథని గడ్డ అనేక మంది మహామహులకు జన్మనిచ్చిందని జిల్లా పెన్షనర్ల సంఘం అసోసియేట్ అధ్యక్షుడు రామడుగు మారుతి అన్నారు. వారందరి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించడానికి ఒక కమిటీ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. వారిని స్మరించడం ద్వారా భావితరాలు స్ఫూర్తి పొందుతాయని అభిప్రాయపడ్డారు. వారి చరిత్రను అక్షరబద్ధం చేయాల్సిన అవసరం ఉందని రావికంటి శ్రీనివాస్ అన్నారు. కార్యక్రమ నిర్వాహకుడు కొండేటి మారుతి మాట్లాడుతూ రావి కంటి రామయ్య ఉపాధ్యాయుడిగా, కవిగా తనదైన ముద్ర వేశారన్నారు. మంథని ప్రముఖుల చరిత్రను వెలుగులోకి తీసుకు రావడానికి చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నామన్నారు. కొమురవెల్లి విజయ్ కుమార్, సత్యనారాయణ, ఏఎంసీ మాజీ ఛైర్మన్ ఆజీంఖాన్, రావికంటి సదానందం, మాడిశెట్టి సుదర్శన్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.