సైబర్ క్రిమినల్స్ స్కెచ్…
దిశ దశ, కరీంనగర్:
ఇంటర్నేషనల్ సైబర్ క్రిమినల్స్ వేసిన బిగ్ స్కెచ్ లో సామాన్యులు సమిధలు కావడం ఖాయంగా కనిపిస్తోంది. మ్యూల్ అకౌంట్ల విషయంలోనూ పకడ్భందీగా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆపరేషన్ క్రాక్ డౌన్ పేరిట పోలీసులు చేస్తున్న దర్యాప్తుతో మ్యూల్ అకౌంట్ల వ్యవహారాన్ని నిగ్గు తేలస్తున్న సంగతి తెలిసిందే. కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు ఇప్పటికే పలు కేసులు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేస్తున్నారు. తాజాగా 8 అకౌంట్ల ద్వారా రూ. 138 కోట్ల లావాదేవీలు జరిగినట్టుగా గుర్తించిన పోలీసులు 13 మందిని అరెస్ట్ చేశారు. అయితే ఈ వ్యవహారంలో విస్తూపోయే వాస్తవాలను పోలీసులు సేకరించినట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది.
కమిషన్ల ఎర…
ఒక్కో బ్యాంకు ఖాతా ఓపెన్ చేసేందుకు రూ. 50 వేలు ఇవ్వడం, ఆ తరువాత జరిగే ప్రతి లావాదేవీలో 2 శాతం కమిషన్ చెల్లించే విధానాన్ని కొనసాగిస్తున్నట్టుగా సమాచారం. వీటిని సైబర్ క్రిమినల్ ముఠాలకు సంబంధించిన టీమ్ అంతా షేర్ చేసుకుంటాయని తెలుస్తోంది. ఈ కమిషన్ల కోసం కక్కుర్తి పడ్డ పలువురు తమ ఆధార్ కార్డులను అప్పగించే వారు. అయితే ఇవే ఆదార్ కార్డులపై కొత్త సిమ్ కార్డులు కూడా తీసుకోవాలని సైబర్ క్రిమినల్ ముఠాలకు చెందిన వారు చెప్పేవారు. సిమ్ కార్డులు ఎప్పుడు కూడా యాక్టివ్ గా ఉంచే విధంగా చొరవ తీసుకోవాలని చెప్పేవారు. మ్యూల్ అకౌంట్ ఓపెన్ చేసిన ఖాతాదారులు వారు చెప్పినట్టుగానే నడుచుకోగా ఆర్థిక లావాదేవీలు జరిగే సమయంలో ఓటీపీలు తమకు వచ్చేవిధంగా యాప్ వినియోగించే వారు. మ్యూల్ ఖాతాలకు డబ్బులు బదిలీ కాగానే మరో అకౌంట్ కు బదిలీ చేసుకునే వారు. ఇలా ఒక్కో లావాదేవిలు 30కి పైగా అకౌంట్లకు బదిలీ చేసి ఆ తరువాత వాటిని హవాలా మార్గాల్లోనో లేక తమకు సంబందించిన అకౌంట్లకో డబ్బును బదిలీ చేసుకుంటారని తెలుస్తోంది. ఎక్కువ సంఖ్యలో అకౌంట్లను ఉపయోగించడం వల్ల ఇక్కడి పోలీసులు దర్యాప్తు చేసినా సకాలంలో సమాచారం అందదని, ఈలోగా ఆ డబ్బులను తమ వద్దకు రప్పించుకోవచ్చన్న అంచనాతోనే సైబర్ క్రిమినల్స్ ఉన్నట్టుగా భావిస్తున్నారు.
వ్యాపారం పేరిట…
అయితే బ్యాంకుల్లో తెరుస్తున్న మ్యూల్ ఖాతాలు కేవలం వ్యక్తుల పేరిటే కాకుండా వివిధ సంస్థల పేరిట కూడా అకౌంట్లు ఓపెన్ చేస్తున్నట్టుగా సమచారం. ఇటీవల కరీంనగర్ ఆర్బీఎల్ బ్యాంకుకు సంబంధించిన 8 అకౌంట్ల వివరాలను సేకరించినప్పుడు ఈ విషయాలు పోలీసుల దృష్టికి వచ్చినట్టు సమాచారం. వ్యాపారం పేరిట అకౌంట్లను ఓపెన్ చేసేందుకు షాపులను ఏర్పాటు చేసినట్టుగా బోర్డులను ఏర్పాటు చేసుకునేవారని తెలుస్తోంది. ఆయా దుకాణాల వద్దకు వచ్చిన బ్యాంకు అధికారులు దుకాణానికి సంబంధించిన వివరాలను సేకరించి లోకేషన్ యాడ్ చేసిన తరువాత అకౌంట్ ఓపెన్ చేసే వారని తెలుస్తోంది. బ్యాంకు నిబంధనల ప్రకారం అంతా సవ్యంగానే సాగిపోతోందని భావించినప్పటికీ అనూహ్యంగా కరీంనగర్ కమిషనరేట్ పోలీసులకు అందిన సమాచారంతో ఆరా తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చినట్టుగా తెలుస్తోంది. రోజుల వ్యవధిలోనే ఒకే అడ్రస్ పై వేర్వేరు షాపులను ఏర్పాటు చేసినట్టుగా అకౌంట్లు ఓపెన్ చేయడంతో అనుమానించిన పోలీసులు మరింత లోతుగా పరిశోధించినట్టుగా సమాచారం. కేవలం బోర్డులు ఏర్పాటు చేసి షాపులు ఉన్నట్టుగా చూపించి ఖాతాలు తీసినట్టుగా పోలీసులు గుర్తించి… కూపీ లాగగా 24 మంది ఈ వ్యవహారంతో సంబంధాలు ఉన్నాయని తేల్చి 13 మందిని అరెస్ట్ చేశారు.
గోవాలో…
ఇటీవల కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు కేసు నమోదు చేసిన వారిలో ఓ ప్రధాన నిందితుడు సైబర్ క్రిమినల్స్ తో సంబంధాలు పెట్టుకుని అతన్ని గోవాకు పిలిపించుకున్నట్టుగా తెలుస్తోంది. దాదాపు మూడు నాలుగు రోజుల పాలు గోవాలో ముఠా సభ్యులు నిర్భందించినట్టుగా తెలుస్తోంది. సదరు వ్యక్తి నిజంగానే కమిషన్ కోసం తమతో నిజంగానే చేతులు కలిపేందుకు వచ్చాడా లేక అతన్ని ఎరగా వేసి పట్టుకునేందుకు పోలీసులు వచ్చారా అన్న విషయంపై స్పష్టత వచ్చిన తరువాతే అతనితో లావాదేవీలు జరిపేందుకు సమ్మతించినట్టుగా తెలుస్తోంది. దాదాపు ఏడాదిన్నర కాలంగా సదరు వ్యక్తి నేతృత్వంలో మ్యూల్ అకౌంట్లు తీయడం మొదలైనట్టుగా సమాచారం ఇప్పటి వరకు జరిగిన లావేదేవీలలో అతను రూ. కోటికి పైగానే సంపాదించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.