దిశ దశ, కరీంనగర్:
మాజీ మంత్రి సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పై కార్పొరేటర్ బండారి వేణు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సోషల్ మీడియా వేదికగా తన కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారంటూ గంగుల లక్ష్యంగా వేణు చేసిన కామెంట్స్ సెన్సేషనల్ గా మారాయి. అయితే తన కుటుంబానికి సంబంధించిన వ్యవహారాల్లో తలదూర్చారని ఆరోపించిన వేణు… ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పై చేసిన వ్యాఖ్యలు దూమారాన్ని లేపుతున్నాయి. గంగుల కమలాకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగడంతో కరీంనగర్ లో ఉద్రిక్తంగా మారింది. దీంతో బీఆర్ఎస్ నాయకులను కట్టడి చేయడంతో పాటు ప్రత్యేకంగా పికెట్ ఏర్పాటు చేశారు పోలీసులు.
చర్చకు…
ఒకప్పటి గంగుల అనుచరుడు, ఇప్పటి బీజేపీ కార్పొరేటర్ బండారి వేణు చేసిన కామెంట్లు చర్చకు దారి తీశాయి. తన కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారంటూ ఎమ్మెల్యే గంగుల వ్యక్తిగత విషయాలను కూడా రచ్చకెక్కించడం గమనార్హం. గతంలో వైరల్ అయిన స్క్రీన్ షాట్లను, ప్రచారాన్ని ఊటంకిస్తూ బండారి వేణు చేసిన కామెంట్లు అటు పార్టీలో ఇటు సొసైటీలో ఆసక్తికర చర్చ మొదలైంది. బండారి వేణు ఆరోపిస్తున్నట్టుగా ఆయన కుటుంబ వ్యవహారానికి సంబంధించిన అంశాలపై గంగుల జోక్యం చేసుకుని సోషల్ మీడియాలో వైరల్ చేయించారని అంటున్నారు. ఇందుకు కౌంటర్ గా వేణు చేసిన కామెంట్లకు సంబంధించిన వీడియో వైరల్ కావడం గమనార్హం.
పార్టీ…
ఓ వైపున కుటుంబ వ్యవహారాలు, వ్యక్తిగత విషయాలు అంటూనే మరో వైపున ఇరు పార్టీల నాయకులు కూడా ఈ అంశంలో జోక్యం చేసుకోవడం విశేషం. బండారి వేణుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆయన ఇంటిపైకి వెళ్లేందుకు ప్రయత్నించాయి. ఈ క్రమంలో పోలీసులు అడ్డుకుని వారిని అరెస్ట్ చేశారు. మరో వైపున బీజేపీ ముఖ్య నాయకులు కూడా రంగంలోకి దిగి బండారి వేణుకు మద్దతుగా పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారని తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారానికి రాజకీయ రంగు పులుముకున్నట్టయింది. పోలీసులు కూడా రంగంలోకి దిగాల్సి వచ్చింది.