అసాంఘీక శక్తులపై ఉక్కుపాదం…
దిశ దశ, కరీంనగర్:
అసాంఘీక శక్తుల అణిచివేత, నక్సల్స్ ఏరివేతలో అత్యున్నత సేవలందించిన కరీంనగర్ రూరల్ సీఐ అనుముల నిరంజన్ రెడ్డి ఇండియన్ పోలీస్ మెడల్ అందుకున్నారు. కరీంనగర్ రూరల్ సీఐగా విధులు నిర్వర్తిస్తున్న ఆయన 2025లో ఐపీఎంకు ఎంపిక కాగా శనివారం హైదరాబాద్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఐపీఎం తీసుకున్నారు.
పీసీ నుండి సీఐ వరకు…
1989లో పోలీసు కానిస్టేబుల్ గా ఎంపిక అయిన నిరంజన్ రెడ్డి 1990లో జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ లో మొదటి పోస్టింగ్ పొందారు. నక్సల్స్ వ్యతిరేక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్న నిరంజన్ రెడ్డి పలు ఎదురు కాల్పుల ఘటనల్లో పాలుపంచుకున్నారు. 1992లో తన వరంగల్ ఉమ్మడి జిల్లాలోని తన స్వగ్రామానికి వెలుతున్న నిరంజన్ రెడ్డిపై నక్సల్స్ కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయనతో పాటు మరో కానిస్టేబుల్ శంకర్ లు తీవ్ర గాయాల పాలయ్యారు. చికిత్స అనంతరం తిరిగి విధుల్లో చేరిన నిరంజన్ రెడ్డి నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్లలో చురుగ్గా పాల్గొన్నారు. 1994 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నక్సల్స్ గ్రూపులకు అత్యంత పట్టున్న సిరిసిల్ల ప్రాంతంలోని వీర్నపల్లిలో ఏర్పాటు చేసిన సీఆర్పీఎఫ్ క్యాంపు గైడ్ గా వ్యవహరించారు. నక్సల్స్ ఇచ్చిన ఎన్నికల బహిష్కరణ నినాదం విఫలం కావాలన్న లక్ష్యంతో పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేకంగా క్యాంపులను ఏర్పాటు చేసేవారు. అందులో భాగంగా వీర్నపల్లిలో ఏర్పాటు చేసిన క్యాంప్ గైడ్ గా వ్యవహరించిన నిరంజన్ రెడ్డి నక్సల్స్ ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకోవడంలో సఫలం అయ్యారు. నక్సల్స్ కార్యకలాపాలను నిరోధించడంలో కీలకంగా పని చేసిన నిరంజన్ రెడ్డికి అప్పటి ఎస్పీ రత్నారెడ్డి సీనియారిటీని కాదని హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి కల్పించారు. 1994 తరువాత ఎస్సైగా పదోన్నతి పొందిన నిరంజన్ రెడ్డి 2023లో సీఐగా ప్రమోషన్ అందుకున్నారు. ఎస్సైగా ఉమ్మడి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ లలో విధులు నిర్వర్తించిన ఆయన సీఐ హోదాలో విజిలెన్స్, ఇంటలీజెన్స్ తో పాటు లా అండ్ ఆర్డర్ విభాగంలో పలు ప్రాంతాల్లో సేవలందించారు.
నక్సల్స్ ఏరివేతే కాకుండా సామాజిక అంశాలపై కూడా నిరంజన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. బాలలు, యువత సన్మార్గంలో నడిపించేందుకు అవసరమైన విధంగా చొరవ తీసుకునేవారు. వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి రోగులకు చికిత్సతో పాటు మెడిసిన్స్ ఉచితంగా అందించడం, కంటి అద్దాలను పంపిణీ చేయించడంలో కూడా తనవంతు బాధ్యతలు నిర్వర్తించారు. డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలను నియంత్రించడంతో పాటు సైబర్ నేరాల విషయంలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు.
పతకాలు…
క్షేత్ర స్థాయిలో పలు అవార్డులు, రివార్డులు అందుకున్న నిరంజన్ రెడ్డి ముఖ్యమంత్రి సేవా పతకం, ముఖ్యమంత్రి ఉత్తమ సేవా పతకాన్ని ఇప్పటికే అందుకున్నారు. తాజాగా ఇండియన్ పోలీస్ మెడల్ అందుకోవడం విశేషం.