నారాయణపూర్ బాధితుల రిలే దీక్షలు…

గ్రామంలో ఉద్రిక్తత…

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ గ్రామం మొత్తాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ స్థానికులకు రిలే దీక్షలకు పూనుకున్నారు. గ్రామంలోనే ఏర్పాటు చేసిన శిబిరంలో స్థానికులు దీక్ష చేపట్టారు. నారాయణపూర్ ప్రాజెక్టు కారణంగా గ్రామంలోని 33 ఇండ్లు మాత్రమే ముంపునకు గురువుతున్నాయని వాటికి మాత్రమే పరిహారం చెల్లిస్తామని అధికారులు ప్రకటించారు. గతంలో నిర్వహించిన సమావేశాల్లో కూడా ఇదే డిమాండ్ ను అధికారుల ముందు ఉంచినప్పటికీ వారు కుదరదని స్పష్టం చేశారు. అయితే నారాయణపూర్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టినప్పటి నుండి కూడా ఈ సమస్యకు పరిష్కారం మాత్రం చూపలేకపోయారు. బీఆర్ఎస్ హయాంలో కూడా నారాయణపూర్ వాసుల డిమాండ్ వినిపించినప్పటికీ ఇందుకు అనుగుణంగా మాత్రం నిధులు విడుదల కాలేదు. అప్పటి నుండి నాన్చుకుంటూ వస్తున్న ఈ అంశంపై అధికారయంత్రాంగం శాశ్వత పరిష్కరం కోసం చొరవ తీసుకోకపోవడం వల్లే అపరిష్కృతంగా మిగిలిపోయింది. అయితే రిజర్వాయర్ లో నీరు నిలువ ఉన్నప్పుడు తమ ఇండ్ల వరకూ చేరుకుంటాయని, దీనివల్ల పాములు, తేళ్లు ఇండ్లలోకి చొరబడే ప్రమాదం ఉందని నారాయణపూర్ గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామం మొత్తాన్ని ముంపునకు గురైనట్టు ప్రకటించి ఇందుకు పరిహారం చెల్లించేలా కృషి చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల నిర్వహించిన గ్రామ సభల్లో కూడా గ్రామ అభివృద్ది కోసం చేపట్టాల్సిన పనుల గురించి చర్చకు రాగా, నిర్వాసిత గ్రామంగా గుర్తించాలని డిమాండ్ చేస్తుంటే ప్రభుత్వం నుండి అభివృద్ది కోసం నిధులు ఇవ్వాలని ఎలా అడుగుతామంటూ బాధితులు ప్రశ్నించారు. రిజర్వాయర్ కారణంగా ప్రాణాల గుప్పిట పెట్టుకుని జీవించాల్సి వస్తుందని అధికారులు కూడా తమ సమస్యను గుర్తించి శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్థులు కోరుతున్నారు.

సోషల్ మీడియా…

ఈ క్రమంలోనే స్థానిక సర్పంచ్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియా వేదికగా పోస్టుల పరంపర కొనసాగినట్టుగా తెలుస్తోంది. దీంతో మనస్తాపానికి గురైన ఆయన ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో 13 మందిపై అట్రాసిటీ కేసు నమోదు అయింది. వీరిలో ఒకరిద్దరు తప్ప మిగతా వారంతా కూడా గ్రామంలో కనిపించకుండా పోవడంతో స్థానికంగా ఆందోళన నెలకొంది. అయితే అట్రాసిటీ కేసులో పోలీసులే తీసుకెళ్లి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతుండగా పోలీసులు మాత్రం అలాంటిదేమీ లేదంటున్నారు. ఈ కేసును ఏసీపీ విచారించాల్సి ఉంటుందని, క్షేత్ర స్థాయి విచారణ జరపకుండా అరెస్ట్ లు చేసే అవకాశం ఉండదని స్పష్టం చేశారు. ఈకేసులో సంబంధం ఉన్న 12 మంది కనిపించకుండా పోవడానికి కారణమేంటన్నది మాత్రం తెలియరావడం లేదు.

మంత్రి దృష్టికి…

నారాయణపూర్ వాసుల సమస్య పరిష్కారం కోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. పరిహారం విషయంలో ప్రభుత్వం సానుకూలంగా లేనట్టుగా సమాచారం. గతంలో అధికారులు ఇచ్చిన నివేదికలు, తాజా నివేదికలు అన్ని కూడా ముంపు గ్రామంగా నారాయణపూర్ మొత్తాన్ని గుర్తించేందుకు అనుగుణంగా లేనట్టుగా తెలుస్తోంది.

gangadharakarimnagarnarayanapurprojectTG NEWS
Comments (0)
Add Comment