దిశ దశ, పెద్దపల్లి:
పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల మీదుగా ప్రవహిస్తున్న మానేరు నదిపై టోల్ వసూళ్లు చేస్తున్నారని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు అందింది. సోమవారం ప్రజావాణిలో ఈ మేరకు దరఖాస్తు చేశారు. పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల సరిహద్దుల మీదుగా ప్రవహిస్తున్న మానేరు నదిపై ఓదెల మండలం కనగర్తి నుండి కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి వరకు తాత్కాలిక రహదారిని నిర్మించారు స్థానికులు. ఈ రోడ్డు మీదుగా రాకపోకలు సాగిస్తున్న వాహనాల నుండి ‘‘కనగర్తి వెంకటేశ్వర స్వామి ఆయల అభివృద్ది’’ పేరిట టోల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని మల్లారెడ్డిపల్లికి చెందిన వ్యక్తి ఫిర్యాదు చేశారు. ప్రతి వాహనానికి ఇంత అని ధర నిర్ణయించి వసూలు చేయడం అక్రమమేనంటూ ఆయన తన పిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు అందుకున్న అధికారులు విచారణ కోసం దేవాదాయ శాఖ అధికారులకు పంపిస్తున్నట్టుగా వెల్లడించారు. అయితే ఇక్కడ రోడ్డు నిర్మాణం చేయడం కూడా నిబంధనలకు విరుద్దమేనని మల్లారెడ్డిపల్లి వాసులు అంటున్నారు. పర్యావరణ విభాగంతో పాటు పలు ప్రభుత్వ శాఖల నుండి అనుమతులు తీసుకోవల్సి ఉన్నప్పటికీ వెంటకేశ్వర స్వామి ఆయల అభివృద్ది పేరిట టోల్ వసూళ్లు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. నిబంధనలకు విరుద్దంగా సాగుతున్నటోల్ వసూళ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.