నిందితుల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులు…
అరెస్ట్ చేసిన ఆదిలాబాద్ పోలీసులు…
దిశ దశ, ఆదిలాబాద్:
అనుమతులు లేకుండానే ఏకంగా రూ. 20 లక్షల విలువైన పేలుడు పదార్థాలు అక్రమ రవాణా చేశారు. ఉత్తర ప్రదేశ్ నుండి తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాకు తరలిస్తున్నారు. పోలీసులు కీలక సమాచారం అందుకుని భారీ నెట్ వర్క్ ను ఛేదించారు. ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేసు పూర్వాపరాలు వెల్లడించారు. మైన్స్, క్రషర్లకు అక్రమంగా విక్రయిస్తున్న ముఠాను ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం పిప్పర్ వాడ టోల్ ప్లాజా సమీపంలో పేలుడు పదార్థాల అక్రమ రవాణా చేస్తున్న ఏడుగురి ముఠాను పట్టుకున్నారు. వీరి నుండి రూ. 19 లక్షల విలువ చేసే 20 వేల ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు, రూ. 15 వేల విలువ చేసే 90 బూస్టర్లు, TS03UB0194 బొలెరో వాహనం, TS04ER6575 హోండా సిటీ కార్, ఆరు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
యూపీ నుండి…
ఉత్తరప్రదేశ్కు చెందిన రవికుమార్ అనే వ్యక్తి ద్వారా పేలుడు పదార్థాలను సమకూర్చుకుని ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చేరవేస్తున్నట్టుగా పోలీసుల విచారణలో తేలింది. వివిధ పేర్లపై యూపీలోని పేలుడు పదార్థాల కంపెనీలో పేలుడు పదార్ధాలు కొనుగోలు చేస్తున్నట్టుగా బిల్లులు తయారు చేస్తున్నారని గుర్తించారు. వీటిని క్రషర్లు, క్వారీలు, మైన్స్కు అధిక ధరలకు విక్రయించే పనిలో ఈ ముఠా నిమగ్నమైందని పోలీసులు వెల్లడించారు. ఈ ముఠా గురించి సమాచారం అందుకున్న వెంటనే వ్యూహాత్మకంగా వ్యవహరించి పట్టుకున్నామని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.
ఉమ్మడి జిల్లా వాసులే…
అయితే ఆదిలాబాద్ జిల్లా పోలీసులు పేలుడు పదార్థాలను తరలిస్తున్న ముఠాను పట్టుకున్న వారిలో ఏడుగురు నిందితులు కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వారే కావడం గమనార్హం. అరెస్ట్ అయిన వారిలో పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తికి చెందిన చెప్యాల పరుశు రాము (30) (ప్రస్తుత నివాసం బోడుప్పల్ సమీపంలోని మేడిపల్లి), హనుమకొండలోని దుర్గానగర్ కాలనీకి చెందిన వల్లెపు తేజ (23), (ప్రస్తుత నివాసం భీమదేవరపల్లి మండలం కొప్పూర్), వీణవంక మండలం నర్సింహులపల్లికి చెందిన కదం శ్రావణ్ (36), భీమదేవరపల్లి మండలం కొప్పూర్ కు చెందిన కస్తూరి సునీల్ (26), విశ్వనాథ్ కాలనీకి చెందిన సూర రంజిత్ (25), శంకరపట్నం మండలం చింతపల్లి గ్రామానికి చెందిన కస్తూరి మధు కిరణ్ (28), పాగల సంపత్ రెడ్డి (52)లను అరెస్ట్ చేశారు. వీరితో పాటు ఉత్తరప్రదేశ్ కు చెందిన రవి కుమార్ తో పాటు ఎండీ వాహిద్ లపై కూడా కేసు నమోదు చేశారు. పేలుడు పదార్థాల క్రయవిక్రయాలతో పాటు అక్రమ రవాణాలో వీరి పాత్ర ఎంతమేర ఉందన్న విషయంపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ మీడియా సమావేశంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, జైనథ్ సీఐ జి శ్రావణ్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, ఎస్సై పి గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.