దిశ దశ, వేములవాడ:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. లంచం తీసుకుంటున్న తహసీల్దార్, ఆపరేటర్లను పట్టుకున్నారు. సంఘటనా వివరాల్లోకి వెలితే… వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామానికి చెందిన ఓ రైతుకు సంబంధించిన భూమిని గిఫ్ట్ డీడ్ చేసేందుకు డబ్బులు అడగడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. తన అత్తకు సంబంధించిన భూమిని తన తండ్రి పేరిట గిఫ్ట్ డీడ్ చేసేందుకు రూ. 8 వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో గురువారం దాడులు చేశారు. ఈ ఘటనలో వేములవాడ రూరల్ తహసీల్దార్ మహమ్మద్ అబూబాకర్, భూ భారతి ఆపరేటర్ శంకసాల అనిల్ కుమార్ లను పట్టుకున్నారు. కెమికల్ టెస్ట్ అనంతరం వాంగ్మూలాలు సేకరించిన ఏసీబీ అధికారులు వీరిని కరీంనగర్ ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరు పర్చనున్నారు.