డాక్టర్ సంజయ్ కుమార్ కౌంటర్ అటాక్…
దిశ దశ, జగిత్యాల:
సోమవారం జగిత్యాలలో జరగనున్న బీఆర్ఎస్ బహిరంగ సభకు ఆ పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలే కాకుండా సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఫ్లెక్సీలు కూడా ప్రత్యక్ష్యం అయ్యాయి. ఆదివారం సాయంత్రం వరకు కూడా జీవన్ రెడ్డి పార్టీలో చేరనున్న సమావేశానికి వస్తున్న వారికి స్వాగతం చెప్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు మాత్రమే కనిపించాయి. సాయంత్రం తరువాత అనూహ్యంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలు ప్రత్యక్ష్యం కావడం సరికొత్త చర్చకు దారి తీస్తోంది.
అభివృద్ది కోసం…
సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఫోటోతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్థానిక నాయకుల ఫోటోలు ముద్రించిన ఈ ఫ్లెక్సీలలో అభివృద్దిలో భాగస్వామ్యం కావాలంటూ పిలుపునిచారు. జగిత్యాల పట్టణ అభివృధ్ది రూ. 135 కోట్లు మంజూరు చేసి పట్టణంలో సీసీ రోడ్లు, ఆగిపోయిన డబుల్ బెడ్రూం ఇండ్లు, ఆగిపోయిన మెడికల్ కాలేజీ, ఆగిపోయిన హాస్పిటల్, క్యాన్సిల్ అయిన మహిళా డిగ్రీ కాలేజీకి, కేజీబీవీ పాఠశాలకు, ఆగిపోయిన రోళ్ల వాగు ప్రాజెక్టుకు నిధులు, రాయికల్ పట్టణానికి రూ. 15 కోట్లు, యావర్ రోడ్ విస్తరణ కోసం నిధులు, గ్రామాల్లో 3500 ఇందిరమ్మ ఇండ్లు, స్కూల్ భవనాలు మంజూరు చేసి అభివృద్దికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదములు అంటూ ఫ్రత్యేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం గమనార్హం. బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేయనున్న బహిరంగ సభ నేపథ్యంలో కౌంటర్ గా సంజయ్ కుమార్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినట్టుగా స్పష్టం అవుతోంది. తన ప్రత్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంపై చర్చ జరుగుతోంది. జీవన్ రెడ్డి జాయినింగ్ సభకు వచ్చే వారంతా తాను ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు గమనించాలన్న వ్యూహంతో బీఆర్ఎస్ ఫ్లెక్సీల పక్కనే సంజయ్ కుమార్ ఫ్లెక్సీలు ప్రత్యక్ష్యం అయ్యాయి. బీఆర్ఎష్ సభకు హాజరయ్యే వారంతా కూడా జగిత్యాలకు కెటాయించిన నిధుల గురించి తెలుసుకునేలా ఏర్పాటు చేయడం గమనార్హం. ఏది ఏమైనా జగిత్యాల బీఆర్ఎస్ కార్యక్రమంలోనే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది.