బయో మైనింగ్ కాంట్రాక్టు తీరు…
దిశ దశ, కరీంనగర్:
ఏపీలో డంపింగ్ యార్డ్ బయో మైనింగ్ చేసేందుకు కాంట్రాక్టు తీసుకుని సకాలంలో పనిచేయకపోవడంతో టర్మినేషన్ చేసిన ఏజెన్సీనే తెలంగాణాలో కాంట్రాక్టు పొందడం గమనార్హం. కరీంనగరానికి గుదిబండగా మారిన చెత్తను తొలగించేందుకు బయో మైనింగ్ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందు కోసం కాంట్రక్టు విధానంలో పనులు అప్పగించారు. అయితే కరీంనగర్ డంప్ యార్డ్ బయో మైనింగ్ కాంట్రాక్టు పొందిన ఏజెన్సీ గురించి సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సదరు సంస్థపై ఏకంగా అక్కడి అసెంబ్లీలో కూడా చర్చ జరిగిందంటే ఈ సంస్థపై ఏ స్థాయిలో ఆరోపణలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
బయో మైనింగ్…
కరీంనగర్ శివార్లలో పేరుకపోయిన చెత్తను బయో మైనింగ్ ద్వారా ప్రాసెస్ చేసేందుకు జ్ఞానేశ్వర ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఏజెన్సీ ఏపీలోని 17 మునిసిపాలిటీలలో కాంట్రాక్టు పొందింది. 2024లో కాంట్రాక్ట్ పొందిన ఈ కంపెనీ కేవలం మూడు చోట్ల మాత్రమే పనులు పూర్తి చేసిందని మిగతా వాటిల్లో అసలు వర్క్స్ మొదలు పెట్టలేదని ఏపీ ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు ఈ ఏడాది జనవరి 30న ఆయా మునిసిపాలిటీల్లో బయోరీమెడిటేషన్, బయో మైనింగ్ కు సంబంధించిన పనులు మొదలు పెట్టనందున టర్మినేట్ చేస్తున్నామని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. స్వచ్ఛాంధ్రా కార్పొరేషన్ ద్వారా ఇచ్చిన ఆ కాంట్రాక్టులను రద్దు చేస్తున్నామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఆరోపణలు…
మరో వైపున సదరు కంపెనీ నిర్వహాకుడు జానీ సైదాపై చిలకలూరి పోలీస్ స్టేషన్ పై క్రిమినల్ కేసు నమోదు అయింది. మూడు చక్రాల రిక్షాలు తయారు చేసేందుకు తనతో ఒప్పందం చేసుకుని తనకు ఇవ్వాల్సిన రూ. 6.29 లక్షలు చెల్లించకపోగా బెదిరింపులకు పాల్పడుతున్నాడని బాధితుడు అనిరుధ్ రాణా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు జానీ సైదాపై చిలకలూరి పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదు చేశారు. మరో వైపున జానీ సైదాకు స్వఛ్చాంద్ర కార్పోరేషన్ ద్వారా ఇచ్చిన పనుల్లో అవినీతి జరిగిందంటూ చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు అసెంబ్లీ సమావేశాల్లో ఆరోపణలు చేశారు. అంతేకాకుండా సదరు కంపెనీ నిర్వాహాకునిపై కూలీలు కూడా ఆరోపణలు చేసిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి.
కరీంనగర్ లో…
అయితే కరీంనగర్ లో మాత్రం ఏపీలో చేసిన అనుభవాన్ని చూపిస్తూ జ్ఞానేశ్వర ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ బయో మైనింగ్ ప్రాసెస్ చేసేందుకు కాంట్రాక్ట్ పొందడం గమనార్హం. 29 వేల మెట్రిక్ టన్నుల చెత్తను ప్రాసెస్ చేసేందుకు 1.63 కోట్లకు అగ్రిమెంట్ అయినట్టుగా తెలుస్తోంది. ఇక్కడ కూడా టెండర్ అగ్రిమెంట్ ప్రకారం సకాలంలో పనులు పూర్తి కానట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా జ్ఞానేశ్వర ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఏజెన్సీ బయో మైనింగ్ ప్రాసెస్ చేసే టెరెక్స్ మిషనరీని వేరే వద్ద లీజుకు తీసుకుని ఇక్కడ ప్రాసెస్ చేస్తోంది. అయితే సదరు ఏజెన్సీ మిషనరీని వివేక్ ఇన్ ఫ్రా అనే సంస్థ నుండి లీజుకు తీసుకున్నామని ఆ సంస్థ తనను మోసం చేసిందని వేరే కంపెనీకి చెందిన మిషనరీని తనకు సబ్ లీజుకు ఇచ్చిందని కరీంనగర్ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే కాంట్రాక్టు నిబంధనల ప్రకారం పనులు చేయలేదని కూడా ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు వివేక్ ఇన్ ఫ్రాపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో జ్ఞానేశ్వర ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఏపీలో విఫలం అయినా తెలంగాణాలో మాత్రం కాంట్రాక్టు పొందగలిందన్న విషయం వెలుగులోకి వచ్చింది.