టెంపరరీ డ్రైవర్, కండక్టర్లను నియమించనున్న ఆర్టీసీ..!

దిశ దశ, హైదరాబాద్:

కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రయాణీకులను గమ్య స్థానాలకు చేర్చేందుకు ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. సమ్మె ప్రారంభం అయిన మొదటి రోజునే పలు చోట్ల బస్సులను నడిపించేందుకు ప్రయత్నించారు. కొన్ని రూట్లలో బస్సులు నడవగా మరి కొన్ని చోట్ల బస్సులు బయటకు రాకుండా కార్మికులు అడ్డుకున్నారు. అయితే సమ్మె ప్రారంభించిన మొదటి రోజు నుండే ఆర్టీసీ యాజమాన్యం తాత్కాలిక డ్రైవర్ కండక్టర్లను నియమించాలని భావిస్తోంది. ఈ మేరకు ప్రచారాన్ని కూడా ప్రారంభించింది. TGSRTCలో టెంపరరీ డ్రైవర్లుగా పని చేసే వారు హెవీ లైసెన్స్ కలిగి ఉండి 18 నెలల అనుభవం ఉండాలని, ఆసక్తి ఉన్నవారు ఒరిజినల్ ఆదార్ కార్డు, 2 పాస్ పోర్టు సైజ్ ఫోటోలు తీసుకుని సంబంధిత డిపో కార్యాలయాల్లో సంప్రదించాలని ఆర్టీసీ అధికారులు సూచిస్తున్నారు. టెంపరరీ కండక్టర్ గా పని చేయాలనుకున్న వారు ఒరిజినల్ ఎస్సెస్సీ మెమో, ఒరిజినల్ ఆధార్ కార్డ్, రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు ఇవ్వాల్సి ఉంటుందని వెల్లడించారు. ఆయా డిపోలకు సంబంధించిన ఫోన్ నంబర్ల ద్వారా సంప్రదించాలని కూడా అధికారులు సూచిస్తున్నారు. డ్రైవర్ డ్యూటీ చేసే వారికి రోజుకు రూ. 1000, కండక్టర్ అయితే రూ. 800ల చొప్పున చెల్లిస్తామని కూడా ప్రకటించారు. ఇఫ్పటికే కొన్ని జిల్లాల్లో తాత్కాలిక డ్రైవర్, కండక్టర్లను నియమించుకునే పనిలో ఆర్టీసీ అధికారులు నిమగ్నం అయినట్టుగా తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలో 37 మంది డ్రైవర్, 44 మంది కండక్టర్ లుగా పని చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. రేపటి కల్ల ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదే రెస్పాన్స్ రాష్ట్రంలోని అన్ని డిపోల్లో ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే అద్దెపై  నడుస్తున్న ఎలక్ట్రిక్, సాధారణ బస్సులను నడిపిస్తున్నారు. టెంపరరీ డ్రైవర్లను నియమించినట్టయితే బస్సుల సంఖ్య మరింత  పెరిగే అవకాశాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు.

flash newsLatest NewsRTC JACRTC strikeTG NEWS
Comments (0)
Add Comment