దిశ దశ, హుజురాబాద్:
వరంగల్, కరీంనగర్ బల్దియాలతో పాటు పలు మునిసిపాలిటీలకు సంబంధించిన చెత్తను హుజురాబాద్ సమీపంలోని సిర్సపల్లికి తరలించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. సమీప ప్రాంతాల వాసులు కాలుష్యం కోరల్లో చిక్కుకునే ప్రమాదం ఉందని స్థానికులు అంటున్నారు. సిర్సపల్లి గుట్టట నడుమ ఉన్న 25 ఎకరాల భూమిలో డంప్ యార్డ్ ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పాదన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని దీనివల్ల జల, వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోందని స్థానికులు అంటున్నారు. ఆదివారం అఖిలపక్ష సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడుతూ… సిర్సపల్లిలో ఏర్పాటు చేయనున్న డంప్ యార్డ్ కు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. సమీపంలోని 20 గ్రామాల్లో సభలు ఏర్పాటు చేసి సిర్సపల్లి డంప్ యార్డ్ కు వ్యతిరేకంగా తీర్మానాలు చేయించాలని నిర్ణయించిన సమావేశం ఈ బాధ్యతలను పోల్సాని రామారావు, కట్కూరి మల్లారెడ్డిలకు అప్పగించారు. హుజురాబాద్ మునిసిపాలిటీలో కూడా ఈ డంప్ యార్డుకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని ప్రతిపాదించారు. సోమవారం నుండి సిర్సపల్లితో పాటు సమీప గ్రామాల్లో నిరసన దీక్షలు చేపట్టాలని, రాజకీయ పార్టీల నాయకులకు వినతి పత్రాలు అందించి డంప్ యార్డ్ రద్దు కోసం కృషి చేయాలని అఖిలపక్ష సమావేశం నిర్ణయించింది. హైకోర్టును ఆశ్రయించే విషయంపై కూడా సమాలోచనలు చేయాలని సమావేశం భావించింది. అఖిలపక్ష కమిటీ కో ఆర్డినేటర్ ఈశ్వర్ రెడ్డి మాట్లాడుతూ… డంప్ యార్డు వల్ల సమీప గ్రామాల వాసులు అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీని ప్రభావం పంట పొలాలపై కూడా పడనుందని, ప్రమాదకరమైన వాయువు విస్తరించనుందని దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతారన్నారు.