కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో సైబర్ టెర్రర్ లింకులు..?

NIA బృందం సోదాలు…

దిశ దశ, గోదావరిఖని:

ఉగ్రమూలాలు ఉమ్మడి జిల్లాలో ఇంకా కొనసాగుతున్నాయా..? నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించిందా..? నిన్న మొన్నటి వరకు ఉగ్ర లింకులు మాత్రమే వెలుగులోకి రాగా ఇప్పుడు సైబర్ టెర్రర్ లింక్స్ ఉన్నాయని అనుమానిస్తున్నారా..? రామగుండంలో NIA సోదాలు సంచలనంగా మారాయి. అయితే AIపై ట్రైనింగ్ ఇస్తామని ప్రచారం చేస్తే గ్రూపులో చేరానని ఆ తరువాత సంఘ విద్రోహుల కార్యకలాపాల కోసం గ్రూప్ ఏర్పాటు చేశారని గుర్తించి ఆ గ్రూప్ నుండి ఎగ్జిట్ అయ్యానని సదరు యువకుడు చెప్తున్నారు.

రామగుండం…

పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణంలోని అయోధ్యనగర్ కు చెందిన ఓ యువకుడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. సోషల్ మీడియా ప్లాట్ ఫారంపై ఏఐ ట్రైనింగ్ ఇస్తామని ప్రచారం చేయడంతో ఆ గ్రూపులో చేరాడు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత దేశ సౌర్వభౌమత్వం, భద్రత, ఐక్యతకు భంగం కల్గించడం, ప్రజల్లో భయాందోళనలు కల్గించేందుకు ప్రయత్నించేందుకు ఉగ్రవాదులు సైబర్ టెర్రర్ కు పాల్పడినట్టుగా నిఘా వర్గాలు గుర్తించాయి. భారత ప్రభుత్వానికి చెందిన 54 వెబ్ సైట్లపై దాడులకు ప్రయత్నించినట్టుగా గమనించాయి. ఈ మేరకు గుజరాత్ ఏటీఎస్ గత సంవత్సరం జులైలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఉగ్ర లింకులు వెలుగులోకి రావడంతో ఎన్ఐఏ రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తోంది. దేశంలోని ఐదు ప్రాంతాల్లో సోమవారం దాడులు చేపట్టిన ఎన్ఐఏ బృందం రామగుండంలో కూడా సోదాలు చేపట్టింది. అయోధ్యనగర్ లోని సదరు యువకుడి ఇంటికి చేరుకున్న ఎన్ఐఏ అధికారులు సమగ్రంగా ఆరా తీశారు. ఎలక్ట్రానికి పరికరాలను స్వాధీనం చేసుకున్న ఎన్ఐఏ అధికారులు వాటిని ఎనలైజ్ చేసేందుకు సమాయత్తం అయ్యారు. అయితే ఆ యువకుడు మాత్రం ఏఐ ట్రైనింగ్ ఇస్తామంటే సోషల్ మీడియా గ్రూపులో జాయిన్ అయ్యానని ఆ తరువాత కొంతకాలనికే ఎగ్జిట్ అయ్యానని చెప్తున్నారు. ల్యాప్ ట్యాప్, మొబైల్ ఫోన్ తో పాటు ఇతరాత్ర డిజిటల్ పరికరాలను ఎనలైజ్ చేసిన తరువాత యువకుడి పాత్రపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఏడాదిగా…

ఉగ్ర లింకులు ఉన్న సైబర్ వ్యవహారాల్లో రామగుండం యువకుని భాగస్వామ్యం ఉందని ఏడాది క్రితమే గుర్తించినట్టుగా తెలుస్తోంది. అయితే సోషల్ మీడియా గ్రూపుల్లో జాయిన్ అయిన సదరు యువకుని గురించి ఏడాది కాలంగా ఆరా తీస్తున్నట్టుగా సమాచారం. ఈ మేరకు నివేదికలు కూడా ఉన్నతాధికారులకు పంపించిన క్రమంలోనే ఎన్ఐఏ సోదాలు చేపట్టినట్టుగా తెలుస్తోంది.

CYBER TERRORNIAPEDDAPALLYterror linksTG NEWS
Comments (0)
Add Comment