జాతీయ రహదారి సాక్షిగా జూదం కేంద్రం..!

తెలంగాణ వారి ఆధిపత్యం…

పట్టించుకోని ‘‘మహా’’ యంత్రాంగం

దిశ దశ, సిరొంచ:

నేషనల్ హైవేపై ఉన్న ఓ భవనంలో దర్జాగా జూదం నిర్వహిస్తున్నారు. పొరుగునే ఉన్న మహారాష్ట్రలోని సిరొంచ తాలుకా కేంద్రంలో పేకాట కేంద్రం సాగుతున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ సరిహద్దు జిల్లాలకు చెందిన పేకాట రాయుళ్లే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ కేంద్రానికి వందల సంఖ్యల కార్లు క్యూ కడుతున్నాయి.

అనుమతులట…

పేకాట కేంద్రం నిర్వహించేందుకు మహారాష్ట్రలోని ఉన్నతాధికారుల అనుమతులు తీసుకుంటున్నామని ఇందుకు క్లియరెన్స్ కూడా వస్తుందని కూడా నిర్వాహకులు చేస్తున్న ప్రచారం విస్మయానికి గురి చేస్తోంది. నిబంధనలకు విరుద్దంగా చట్ట వ్యతిరేకంగా సాగుతున్న జూదం నడుపుకోవాలని అనుమతులు ఎవరిస్తారన్నదే అంతుచిక్కకుండా పోతోంది. లిఖిత పూర్వకంగా అయితే అనుమతులు ఇచ్చే అవకాశం లేకున్నప్పటికీ పర్మిషన్ల కోసం తిరుగుతున్నామంటూ నిర్వహాకులు చెప్పుకుంటున్న తీరు విచిత్రంగా ఉంది. మరో వైపున క్లబ్ క్లోజ్ చేసేశామని బహిరంగంగా ప్రచారం చేసుకుంటూనే దర్జాగా పేకాట ఆడిస్తున్నారని స్థానికులు చెప్తున్నారు. రిక్రియేషన్ క్లబ్ ఏర్పాటు చేసుకునేందుకు అనుమతులు ఇచ్చినట్టయితే నిబంధనల ప్రకారం సోషల్ యాక్టివిటీలతో పాటు స్పోర్ట్స్ వంటి వాటిని నిర్వహించాల్సి ఉంటుంది. ఇందులో స్థానికేతరులకు నామమాత్రంగా ప్రాధాన్యత ఉండే అవకాశం ఉంది. కానీ సిరొంచ నేషనల్ హైవేపై ఏర్పాటు చేసిన ఈ క్లబ్ పై ఆదిపత్యం అంతా తెలంగాణా వారే చేస్తుండడం గమనార్హం. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన రాజకీయ నాయకులతో పాటు ఇతరుల భాగస్వామ్యం ఉందన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది.

అదే అవకాశమా..?

అయితే గడ్చిరోలి నుండి సిరొంచ వరకు నిర్మిస్తున్న నేషనల్ హైవే నత్తలకే నడుపుతోంది. దీంతో ఇక్కడ క్లబ్ ఏర్పాటు చేసినప్పటికీ జిల్లా కేంద్రం నుండి అధికారులు దాడులు చేసేందుకు వచ్చే అవకాశం లేదన్న అంచనాతోనే క్లబ్ ఏర్పాటు చేసుకుని ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అహేరీ, ఆల్లపల్లి నుండి సిరొంచ వరకు రోడ్డు అధ్వాన్నంగా మారడంతో ఆ ప్రాంతం మీదుగా రాకపోకలు సాగించేందుకు ఎవరూ సాహసించడం లేదు. అధ్వాన్నంగా ఉన్న ఈ రోడ్డు మీదుగా ప్రయాణించి వచ్చి జిల్లా స్థాయి అధికారులు దాడులు చేసే అవకాశం లేదన్న ధీమాతో ఉన్నారన్న చర్చ కూడా స్థానికంగా సాగుతోంది.

మంత్రి ద‌ృష్టికి…

సిరొంచ కేంద్రంగా అక్రమంగా సాగుతున్న జూదం కేంద్రం గురించి గడ్చిరోలి జిల్లా సహపాలక్ మంత్రి జైస్వాల్ దృష్టికి సిరొంచ ప్రాంత వాసులు తీసుకెళ్లినట్టుగా సమాచారం. ఈ విషయంపై మంత్రి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటి నుండి క్లబ్ క్లోజ్ చేశామన్న ప్రచారం విస్తృతంగా చేసినప్పటికీ జూదగాళ్లకు మాత్రం పేకాట సాగుతోందన్న సమాచారం చేరవేస్తున్నారు. దీంతో సిరొంచలో పేకాట క్లబ్ మాత్రం యథావిధిగానే కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది.

GAMINGNATIONALPOKER CLUBsironchaTG NEWS
Comments (0)
Add Comment