దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ జిల్లా కేంద్రంలో అనూహ్యరీతిలో చోరీ జరిగింది. మత్తుకు బానిసైన వ్యక్తి పోలీసు స్టేషన్ కు వచ్చి తన కుటుంబానికి సంబంధించిన కేసు పరిష్కరించాలని అభ్యర్థించేందుకు వెళ్లి ఏకంగా పెట్రో కార్ నే ఎత్తుకెళ్లాడు. పోలీసు వర్గాల్లో కలకలం సృష్టించిన ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ రిజ్వి చమన్ కు చెందిన ఇజాజ్ అనే వ్యక్తి సోమవారం కరీంనగర్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నాడు. తన భార్యను తీసుకరావాలని పోలీసులను కోరాడు. ఇదే విషయంలో గతంలో డయల్ 100కు కూడా పలుమార్లు కాల్ చేశాడు. అయితే సోమవారం రాత్రి 11.30 గంటల వరకూ పోలీస్ స్టేషన్ లోనే ఉన్న ఇజాజ్ అక్కడే పార్క్ చేసి ఉన్న పోలీసు పెట్రో కార్ ఇన్నోవాలో కీస్ ఉండడం గమనించి స్టార్ట్ చేసుకుని వెళ్లిపోయాడు.
అప్రమత్తం…
పోలీసు విభాగానికి చెందిన ఇన్నోవాను ఎత్తుకెళ్లిన సమాచారం అందుకున్న వెంటనే ఏసీపీ విజయ్ కుమార్, సీఐ నిరంజన్ రెడ్డిలు అప్రమత్తం అయ్యారు. ఇన్నోవా ఎటువైపు వెల్తుందో సీసీ కెమెరాల ఆధారంగా వివరాలు సేకరించిన పోలీసులు వరంగల్ వైపునకు వెల్తున్నట్టుగా గుర్తించారు. వెంటనే హుజరాబాద్, ఎల్కతుర్తి, హసన్ పర్తితో పాటు సరిహద్దు పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇచ్చారు. టోల్ గేట్ల సిబ్బందిని కూడా అప్రమత్తం చేశారు. కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ కు చెందిన ఇన్నోవా వెహికిల్ ఎత్తుకెళ్లాడని పట్టుకోవాలని కరీంనగర్ పోలీసులు కోరారు. అయితే మానకొండూరు నుండి కొత్తగా నిర్మించిన నేషనల్ హైవే మీదుగా వెళ్తున్న క్రమంలో ఎల్కతుర్తి దాటిన తరువాత కూడా యథావిధిగానే వెల్తున్న క్రమంలో రోడ్డు అర్థాంతరంగా నిలిచిపోవడంతో దిగువకు జారి పడిపోయింది. యాక్సిడెంట్ కాగానే బెలూన్లు ఓపెన్ కావడంతో అతనికి ప్రాణాపాయం తప్పింది. అయితే ఇన్నోవా నుండి బయటకు వచ్చిన ఇజాజ్ రోడ్డుపైకి వచ్చి వాహాన దారులకు సూచనలు ఇవ్వడం ఆరంభించాడు. కరీంనగర్ నుండి వెళ్లిన కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ నేతృత్వంలోని పోలీసు బృందం ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గురైన ఇన్నోవా వాహనాన్ని క్రేన్ల సహాయంతో బయటకు తీసి కరీంనగర్ కు తరలించారు. ఇజాజ్ పై కేసు నమోదు చేసేందుకు రంగం సిద్దం చేశారు. అయితే పెట్రో కార్ లో ఉన్న వైర్ లెస్ సెట్ ను ఇజాజ్ తీసి బయట పడేసినట్టుగా తెలుస్తోంది.