రంగంలోకి ఇతర రాష్ట్రాల పోలీసులు…
దిశ దశ, కరీంనగర్:
గోల్డ్ థీప్ సుబోధ్ సింగ్ చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్టుగా ఉంది. ఇప్పటికే కరీంనగర్ రాబరీ కేసులో పీటీ వారెంట్ ద్వారా తెలంగాణకు తరలించగా… ఇతర రాష్ట్రాల్లో జరిగిన దోపిడీలపై కూడా విచారించేందుకు రంగం సిద్దమవుతోంది. జైలు నుండే రాబరీలకు స్కెచ్ వేస్తూ ముఠాలను పంపిస్తున్న సుబోధ్ సింగ్ ను దోపిడీలలో ఫిక్స్ చేసేందుకు పలు రాష్ట్రాలు ప్రయత్నించి విఫలం అయ్యాయి. అయితే మే 3న కరీంనగర్ PMJ జ్యూవెలరీ షాపు దోపిడీ తరువాత పోలీసులు అతని ప్రమేయం ఉన్నట్టుగా గుర్తించారు పోలీసులు. ఈ మేరకు ఆరు కోర్టులలో పీటీ వారెంట్ వేసి అనుమతి పొంది కరీంనగర్ కు తరలించారు. ఇటీవల కస్టడీ పిటిషన్ కూడా వేసి విచారించిన పోలీసులకు సుబోధ్ సింగ్ వాస్తవాలు చెప్పేందుకు నిరాకరించాడు. కరీంనగర్ నగల షాపులో దోపిడీకి పాల్పడే ముందు ముఠాకు చెందిన ఒకరు గోల్డ్ చైన్ ఫోటో తీసి సుబోధ్ సింగ్ కు ఎన్ క్రిప్టెడ్ యాప్ ద్వారా షేర్ చేశారు. సాంకేతికతను అందిపుచ్చుకున్న పోలీసులు ఈ ఆధారంతో పాటు మరిన్ని రుజువులను కోర్టుల ముందు ఉంచి అతన్ని విచారించేందుకు అనుమతి తీసుకోవడంలో సఫలం అయ్యారు. అయితే ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితులను విచారించినప్పుడు తుపాకులు, రెండో సెల్ ఫోన్ గురించి చెప్పారు. సీన్ రీ కన్సట్రక్షన్ లో భాగంగా ఆయుధాలను, సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకుని కోర్టుకు నివేదిక సమర్పించారు. ఈ నేపథ్యంలోనే మరో ఇద్దరు నిందితులను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. వీరిలో యాదవ్ అలియాస్ జైనుల్ అబ్దిన్ ఇచ్చిన వాంగ్మూలం అత్యంత కీలకంగా మారింది.
‘‘మహా’’ పోలీసుల ఆరా…
కరీంనగర్ పోలీసులు సుబోధ్ గ్యాంగ్ పై చేపట్టిన స్పెషల్ ఆపరేషన్ గురించి తెలుసుకున్న మహారాష్ట్ర పోలీసులు విచారించేందుకు సమాయత్తం అవుతున్నట్టుగా తెలుస్తోంది. సుబోధ్ గ్యాంగ్ పై పీటీ వారెంట్ వేసి విచారించి తమ రాష్ట్రంలో జరిగిన ఘరానా దోపిడీల గురించి దర్యాప్తు చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు కరీంనగర్ పోలీసులతో సంప్రదింపులు జరిపిన మహారాష్ట్ర పోలీసులు సుబోధ్ సింగ్ ను విచారించేందుకు అనుమతులు తీసుకోనున్నట్టు సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్ చంచల్ గూడ జైలులో ఉన్న సుబోద్ సింగ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకున్న అక్కడి పోలీసులు అతన్ని విచారించేందుకు అనుమతించాలని కోర్టులను ఆశ్రయిస్తున్నట్టుగా సమాచారం. మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల పోలీసులు కూడా సుబోధ్ సింగ్ ను విచారించేందుకు రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో రాబరీ కేసుల మిస్టరీ వీడకపోవడం… ఈ ఘటనలకు ప్రధాన సూత్రదారి సుబోధ్ సింగ్ అని నిర్దారణకు వచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో తమత తమ రాష్ట్రాల్లో మరుగున పడ్డ కేసుల దర్యాప్తును వేగవంతం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఎవరీ యాదవ్..?
రెండు రోజుల క్రితం కరీంనగర్ పోలీసులు జ్యూవెలరీ షాపు దోపిడీ కేసులో ఆరో నిందితుడు యాదవ్ అలియాస్ జైనుల్ అబ్దిన్ అరెస్ట్ చేశారు. ప్రాథమికంగా ఇతన్ని విచారించినప్పుడు అత్యంత కీలక విషయాలు తెలిశాయి. కరీంనగర్ దోపిడీలో ప్రత్యక్ష్యంగా పాల్గొన్న ఐదుగురు నిందితులకు ఆయుధాలు సమకూర్చడంతో పాటు వాహనంలో తరలించినట్టుగా పోలీసుల గుర్తించారు. దోపిడీకి ముందు బిహార్, మధ్యప్రదేష్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల నుండి తెలంగాణ సరిహద్దుల వరకు ముఠా సభ్యులను క్రెటా కారులో తరలించినట్టుగా సమాచారం. దోపిడీ తరువాత మహారాష్ట్రలోని ఓ రైల్వే స్టేషన్ వద్దకు చేరుకున్న తరువాత కొంతమందిని రైల్లో వెళ్లాలని సూచించి, మరికొంతమందిని వాహనంలో తీసుకెళ్లింది యాదవ్ అలియాస్ జైనుల్ అబ్దిన్ అని పోలీసులు తేల్చారు. దీంతో అతన్ని విచారించేందుకు కస్టడీ పిటిషన్ వేయనున్నట్టు సమాచారం. అయితే యాదవ్ కు సుబోధ్ సింగ్ కు మధ్య మరో వ్యక్తి భాగస్వామ్యం కూడా ఉన్నట్టుగా పోలీసుల విచారణలో తేలింది. అతన్ని పట్టుకున్నట్టయితే సుబోధ్ సింగ్ ప్రమేయంపై మరిన్ని ఆధారాలు లభ్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. రాజస్థాన్ లోని జైపూర్ కు చెందిన యాదవ్ డ్రైవర్ గా జీవనం సాగిస్తూ రాబరీ గ్యాంగుతో చేతులు కలిపినట్టుగా తెలుస్తోంది.
డబ్బే కీలకం…
అయితే రాబరీలకు పాల్పడుతున్న ముఠాలో చేరిన చాలా మందికి డబ్బే కీలకంగా మారినట్టుగా తెలుస్తోంది. గ్యాంగ్ లీడర్ తమ కుటుంబాలకు సర్దుబాటు చేస్తున్న డబ్బులు పెద్ద మొత్తంలో ఉండడంతో ఘరానా నేరాలకు పాల్పడేందుకు సాహసిస్తున్నట్టుగా సమాచారం. తమకు అందివచ్చిన అవకాశంతో భారీగా డబ్బు సంపాదించాలన్న ఆశ దోపిడీ ముఠా సభ్యులది అయితే… వీరి బలహీనతే డాన్ కు లాభదాయకంగా మారిపోయింది.