దిశ దశ, కరీంనగర్:
సెలూన్ షాపుకు వెళ్లినప్పుడు అన్నా అని పిల్చాడన్న కోపంతో దుర్భాషలాడుతూ… చేతులతో కొట్టిన ఎస్సైని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. కరీంనగర్ దుర్గమ్మగడ్డ, ఖాన్ పురాలోని ఓ సెలూన్ షాపుకు శనివారం ఉదయం 7.30 గంటలకు త్రిటౌన్ ఎస్సై చైతన్య చందర్ వెళ్లాడు. షాపు నిర్వాహకుడు పగడాల రాము ఎస్సైని ఉద్దేశించి అన్నా కూర్చో అన్నాడు. ఇందుకు ఆగ్రహించిన ఆయన రామును దుర్భాషలాడుతూ, చేయి చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజీ వైరల్ కావడంతో పోలీసు అధికారులు రంగంలోకి దిగారు. ఘటనకు సంబంధించిన పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు పంపించారు. ఎస్సై చైతన్య చందర్ ఆర్టీసీ బస్ స్టేషన్ వద్ద డ్యూటీ ముగించుకుని ఇంటికి వెల్తున్నప్పుడు సెలూన్ షాపుకు వెల్లినట్టుగా పోలీసు అధికారుల విచారణలో తేలింది. సామాన్య పౌరుడిపై దాడి, అధికార దుర్వినియోగం, విధి నిర్వహణలో అనుచితంగా ప్రవర్తించినట్టుగా పోలీసు అధికారుల విచారణలో తేలింది. ఇందుకు సంబంధించిన నివేదికను కరీంనగర్ సీపీ గౌష్ ఆలం, రాజన్న జోన్ 3 డీఐజీ సిఫార్సు మేరకు ఎస్సై చైతన్య చందర్ ను సస్పెండ్ చేశారు.