పార్టీకి దూరమయ్యారా… పట్టించుకోవడం లేదా..?

జగిత్యాలలో కనిపించని ‘‘ఆమె’’

దిశ దశ, జగిత్యాల:

అధికార కాంగ్రెస్ పార్టీని గద్దె దింపేందుకు పకడ్భందీగా సాగుతున్న బీఆర్ఎస్ పార్టీలో కొంతమందిపై వివక్ష కొనసాగుతోందా..? అధినేత కుటుంబం కనుసన్నల్లో ఉన్న వారు ఏం చేసినా చెల్లుతుందన్న ధీమాతో ఉన్నారా అన్నది అర్థం కావడం లేద కానీ…  పార్టీలో మాత్రం ఓ అంశంపై తీవ్రమైన చర్చ సాగుతోంది. సాక్షాత్తు అధినేత హాజరవుతున్న సభకు ఓ బీసీ మహిళా నాయకురాలితో పాటు ఇతర మహిళలకు ప్రాధాన్యత లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారన్నఆవేదన స్థానికంగా వ్యక్తం అవుతోంది.

తుల ఉమ…

ఉద్యమ ప్రస్థానం నుండి గులాభి జెండా ఎత్తుకుని ముందుకు నడిచిన తుల ఉమ జగిత్యాల జిల్లాలోని కథలాపూర్ నుండి జడ్పీటీసీగా గెలిచి ఉమ్మడి కరీంనగర్ జిల్లాపరిషత్ ఛైర్ పర్సన్ గా పని చేశారు. టీఆర్ఎస్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా కూడా పని చేసిన ఉమ తనపై వివక్ష చూపుతున్నారన్న ఆవేదనతో పార్టీని వీడి ఈటల రాజేందర్ తో కలిసి బీజేపీ కండువా కప్పుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు తిరిగి సొంత గూటికి చేరిన ఉమ అప్పటి నుండి పార్టీలోనే కొనసాగుతున్నారు. ప్రస్తుతం తన సొంత ప్రాంతమైన జగిత్యాల జిల్లా మెట్ పల్లిలోనే నివాసం ఉంటున్న తుల ఉమ ఫోటోలు ఎక్కడా కనిపించకుండా జాగ్రత్త పడినట్టుగా స్పష్టం అవుతోంది. మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి ఎపిసోడ్ లో కూడా ఉమ దంపతులు ఆయన ఇంటికి వెళ్లి కలిసిన సీనియర్ నేతల్లో తుల ఉమ దంపతులే ముందు వరసలో ఉన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్న తుల ఉమ బీసీ నాయకురాలు కూడా కావడం గమనార్హం. అయినప్పటికీ ఆమెకు జగిత్యాల సభలో ప్రాధాన్యత కల్పించకపోవడం పార్టీలో చర్చకు దారి తీస్తోంది. పట్టణంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో పాటు, సభా వేదికపై కూడా తుల ఉమ ఫోటోకు అవకాశం కల్పించలేదు స్థానిక నాయకులు.

అందరికీ…

జగిత్యాల సభ కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, పార్టీ బాధ్యులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేతో పాటు జడిత్యాల జడ్పీ మాజీ ఛైర్ పర్సన్ దావ వసంతకు ఫోటో కూడా ముద్రించారు. కానీ తుల ఉమ ఫోటో ఏర్పాటు చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. మరో వైపున వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై ఏకైక మహిళా నాయకురాలు దావ వసంతకు మాత్రమే అవకాశం దక్కింది. మిగతా మహిళా నాయకుల ఫోటోలు కనిపించకపోవడం పార్టీ వర్గాల్లో విస్మయం వ్యక్తం అవుతోంది.

BRS NEWSBRS PARTYKCRktrTelangana Politics
Comments (0)
Add Comment