దిశ దశ, కరీంనగర్:
మ్యూల్ అకౌంట్ల ద్వారా సైబర్ క్రిమినల్స్ నగదు దారి మళ్లించుకున్న వ్యవహారంపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ED) ఎంట్రీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు ఇటీవల 13 మందిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రూ. 138 కోట్ల మేర మ్యూల్ అకౌంట్ల ద్వారా అంతర్జాతీయ నేరస్తులు చేజిక్కించుకుంది. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు ED అధికారులు రంగ ప్రవేశం చేసినట్టుగా సమాచారం. ఈ కేసులో రత్నాకర్ బ్యాంక్ (RBL) మేనేజర్ భువనగిరి కళ్యాణ్, క్యాషీయర్ అయేషా బేగంతో పాటు ఉమ్మడి జిల్లాలోని 13 మందిని అరెస్ట్ చేసినట్టుగా కరీంనగర్ సీపీ గౌష్ ఆలం ప్రకటించారు. ఈ కేసుకు సంబంధించిన పూర్వాపరాలను తెలుసుకునేందుకు ED అధికారుల బృందం ఒకటి కరీంనగర్ చేరుకుంది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలు, మ్యూల్ ఖాతాదారుల వివరాలు, ఏజెంట్లుగా వ్యవహరించిన వారు, బ్యాంకు ఉద్యోగులకు సంబంధించిన ప్రమేయానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు దర్యాప్తులో వెల్లడైన వివరాలను అడిగి తెలుసుకున్నట్టుగా సమాచారం. ఎఫ్ఐఆర్, రిమాండ్ సీడీతో పాటు కేసుకు సంబంధించిన డాక్యూమెంట్లను ఈడీ అధికారులు తీసుకున్నట్టుగా సమాచారం.