డ్రగ్స్ కంట్రోల్ అధికారుల దాడులు
దిశ దశ, హైదరాబాద్:
కిక్కు ఎక్కాలంటే వైన్ షాపుల్లో దొరికే మద్యం మాత్రమే కొనుగోలు చేయాలా..? గంజాయి వంటి మత్తు పదార్థాల కోసం అన్వేషించాలా..? నాటుసారా అమ్మకాల కోసం అన్వేషించాలా..? ఇవేవి అవసరం లేకుండా కూడా మత్తు మందు దర్జాగా కొనుగోలు చేసుకోవచ్చు. ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చి మరీ విక్రయాలు జరిపించే మెడికల్ షాపుల్లో లభ్యం అయ్యే సిరప్, క్యాప్సుల్స్ గురించి తెలుసుకుంటే సరిపోతుంది. సరిగ్గా ఇలాగే ఆలోచించిన వ్యసనపరులు మెడికల్ షాపుల్లో దగ్గు మందు కొనుగోలు చేయడం మొదలు పెట్టారు. మెడికల్ షాపు యజమాని వైద్యులు రాసిచ్చే ప్రిస్కిప్షన్ లేకుండానే బాహాటంగానే విక్రయించడం మొదలు పెట్టారు. ఈ సమాచారం అందుకున్న తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ విభాగం దాడులు చేసి కేసు నమోదు చేసింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఉప్పల్ మండలం రామంతాపూర్, శ్రీనగర్ కాలనీలోని ఎస్‌విఆర్ మెడికల్స్ లో విచక్షణారహితంగా వ్యసనానికి కారణమయ్యే డ్రగ్స్ విక్రయాలు చేస్తున్నారని సమాచారం అందుకున్నారు డ్రగ్స్ కంట్రోల్ అధికారులు. ఈ మేరకు దాడుటు చేయగా సదరు మెడికల్ షాపు నిర్వాహకులు వి రాజు, సవితలు మత్తు అందించి వ్యసనంగా మారే ప్రమాదం ఉన్న కొడైన్ కలిగిన టాసెక్స్ సిరప్, ట్రామడాల్ కలిగిన స్పాస్మో-ప్రాక్సివాన్ ప్లస్ క్యాప్సూల్స్ నిబంధనలకు విరుద్దంగా అమ్మకాలు జరుపుతున్నట్టుగా గుర్తించారు. మెడికల్ షాపు నిర్వాహాకులు డ్రగ్స్ కంట్రోలో నిబంధనలు పాటించకుండా విక్రయాలు చేస్తున్నారని, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టిషనర్ ప్రిస్కిప్షన్ లేకుండానే వ్యసనంగా మార్చే మందులను అమ్ముతున్నారని, బిల్లులు ఇవ్వడం లేదని గమనించారు. వీరు షెడ్యూల్ H1 డ్రగ్ రిజిస్టర్‌లో రికార్డ్ చేయకపోవడంతో పాటు డ్రగ్స్ నిబంధనల ఉల్లంఘనలు జరుగుతున్నాయని గుర్తించిన కంట్రోల్ అధికారులు మెడికల్ షాపులోని రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 120 మిల్లీ మీటర్ల కోడైన్ టాసిక్స్ సిరప్ బాటిళ్లు 20 కూడా పట్టుకున్నారు. కోడైన్, ట్రామడాల్ వంటి వ్యసనంగా మార్చే మందులు వినియోగించడం వల్ల శారీరక, మానసిక పరిణామాలపై తీవ్రమైన ప్రభావం చూపుతాయని, వీటిని తరచూ వాడడం వల్ల వాటిలోని మత్తు కలిగించే ప్రభావాలకు అలవాటు పడి దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంటుందని డ్రగ్స్ కంట్రోల్ అధికారులు చెప్తున్నారు. అధిక మోతాదులో వీటిని వినియోగించడం వల్ల శ్వాసకోస సమస్యలు, మూర్ఛ, కోమా వంటి వ్యాధులకు గురి కావడమే కాకుండా మరణానికి కూడా దారితీసే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. మెడికల్ షాపలు నిర్వాహకులు ఇలాంటి వ్యసనంగా మారే అవకాశం ఉన్న మందులను అమ్మడం తీవ్రమైన నేరంగా పరిగణించాల్సి ఉంటుందని, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం ప్రకారం రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుందని స్పష్టం చేశారు. ఈ దాడులు డిసిఏ డిప్యూటీ డైరెక్టర్-I జి శ్రీనివాస్ పర్యవేక్షణలో, శామీర్‌పేట్ అసిస్టెంట్ డైరెక్టర్ ఎం శ్రీ బిందు, హబ్సిగూడ డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ జి ఇందిరా ప్రియదర్శిని, శామీర్‌పేట్ డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ బి ప్రవీణ్, మేడిపల్లి డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ పి అంబేద్కర్ లు పాల్గొన్నారు. నివాస ప్రాంతాలలో, మందులకు సంబంధించిన చట్టవిరుద్ధ కార్యకలాపాలపై, అలాగే మాదక ద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాలతో సహా డ్రగ్స్‌కు సంబంధించిన అనుమానిత తయారీ కార్యకలాపాలపై ప్రజలు ఏవైనా ఫిర్యాదులను తెలియజేయాలని డ్రగ్స్ కంట్రోల అధికారులు పిలుపునిచ్చారు. వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాలలో డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, తెలంగాణ టోల్-ఫ్రీ నంబర్ 1800-599-6969 ద్వారా సంప్రదించాలని, పని దినాలలో ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తుందని వివరించారు.