దిశ దశ, కరీంనగర్:
ప్రత్యామ్నాయ ఇంధన వినియోగంపై దృష్టి సారించాలని, పెట్రోల్, డిజీల్ వినియోగాన్ని తగ్గించేందుకు చొరవ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం విసృతంగా ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్థిక భారం కూడా తగ్గుతుందని, పర్యావరణ పరంగా కూడా బావుంటుందని చెప్తున్నప్పటికీ ఇందుకు తగిన చొరవ మాత్రం తీసుకోవడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందులో ప్రధానంగా CNG విషయంలో మాత్రం వాహనదారులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావనే చెప్పాలి. CNG వాహనాలను వినియోగించడంపై కేంద్ర ప్రభుత్వం చూపించిన శ్రద్ద అంతా ఇంతా కాదు. దీంతో చాలా మంది CNG వాహనాలను కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చారు. అయితే మార్కెట్లో కొనుగోలు అవుతున్న వాహనాలకు తగ్గట్టుగా CNG బంకులు అందుబాటులో ఉండకపోవడం ఇబ్బందికరంగా మారింది. ఒక్క కరీంనగర్, జగిత్యాల, రామగుండం సమీపంలోని కుందనపల్లిలో ఒకటి చొప్పున మొత్తం ఐదు బంకులు ఉన్నాయి. CNGని వినియోగిస్తున్న ఆటోలే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపు 3వేల నుండి 4 వేల వరకు ఉండగా, స్వంత అవసరాలు, అద్దెలకోసం తిరిగే వాహనాల సంఖ్య కూడా వేలల్లో ఉంటుంది. ఇవే కాకుండా ఉమ్మడి జిల్లా మీదుగా రాకపోకలు సాగించే ఇతర ప్రాంతాలకు సంబంధించిన వాహనాల సంఖ్య కూడా 2 నుండి 3 వేల వరకు ఉంటుంది. CNGని వినియోగించే వాహనాల సంఖ్య ఈ స్థాయిలో ఉంటే మొత్తం ఉమ్మడి జిల్లాలో ఐదు బంకులు మాత్రమే ఉండడం గమనార్హం.
షార్టేజ్…
అయితే నామమాత్రంగానే ఏర్పాటు చేసిన బంకుల్లో కూడా CNG నిరంతంరం అందుబాటులో ఉండదు. CNG ఎప్పుడొస్తుందా అని ఎదరు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కొన్ని సందర్భాల్లో రోజుల తరబడి CNG రాకపోవడంతో పెట్రోల్ తోనే వాహనాలను నడిపించాల్సి వస్తోందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. CNG కోసం నిత్యం బంకల వద్దకు వెళ్లడం నిరాశతో వెనుదిరగడం పరిపాటిగా మారిందని అంటున్నారు. ఒకవేళ CNG స్టాక్ వచ్చినా బంకుల్లో గంటల తరబడి వెయిట్ చేయాల్సిందే తప్ప మరో గత్యంతరం లేదని వాపోతున్నారు.
అప్ డేట్…
అయితే కరీంనగర్ లోని ఓ బంక్ నిర్వాహకులు CNG వినియోగదారుల కోసం ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. CNG వినియోగదాదరుల కోసం ప్రత్యేకంగా ఓ వాట్పప్ గ్రూప్ ఏర్పాటు చేసి CNG అందుబాటులో ఉంది లేదు అనే సమాచారాన్ని అందులో షేర్ చేస్తున్నారు. బంక్ నిర్వాహాకులు తీసుకున్న ఈ చొరవతో తమకు ఎప్పకటిప్పుడు సమాచారం అందుతోందని తెలిపారు. అయితే వాహనాలకు తగినట్టుగా బంకులు ఏర్పాటు చేయడంతో పాటు CNGని కూడా అందుబాటులో ఉంచినట్టయితే ఇలాంటి సమస్యలు ఎదురుకావని వారు చెప్తున్నారు. గతంలో LPG వాహనాలను వినియోగంలోకి తీసుకొచ్చే విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకున్నప్పటికీ చాలినన్ని బంకులు అందుబాటులో ఉంచకపోవడంతో వాహనదారులు అవస్థలు పడడంతో క్రమక్రమంగా LPG వాహనాల వినియోగం తగ్గిపోయిందని… ఇప్పుడు CNG విషయంలో కూడా అదే తరహా నిర్లక్ష్యం కనబరుస్తున్నారని అంటున్నారు.