దిశ దశ, కరీంనగర్:
లంచం తీసుకుంటుండగా రెడ్ హైండెడ్ గా పట్టుబడిన ట్రాప్ కేసులు, ఆదాయానికి మించి ఆస్తులు గడించిన కేసులపైనే ఏసీబీ ఎక్కువగా దృష్టి సారిస్తుంది. కానీ తాజాగా అవినీతి నిరోధక శాఖ అధికారులు నమోదు చేస్తున్న కేసులు సంచలనం అవుతున్నాయి. దీంతో అవినీతికి పాల్పడుతున్న అధికార యంత్రాంగంలో సరికొత్త దడ మొదలైంది. ఇతర మార్గాల ద్వారా లంచం తీసుకోవడంతో సంబరపడిపోతున్న ప్రభుత్వ యంత్రాంగం ఏసీబీకి చిక్కుతామన్న భయంతోనే కాలం వెల్లదీయాల్సిన పరిస్థితి తయారైంది.
ఇలా కూడా…
గతంలో ఇలాంటి కేసులు నమోదైనప్పటికీ అవి నామమాత్రమేనని చెప్పాలి. అయితే తాజగా ఇలాంటి కేసులు నమోదు అవుతుండడం అధికార యంత్రాంగంలో సరికొత్త చర్చ మొదలైంది. కరీంనగర్ రేంజ్ ఏసీబీ అధికారులు వరసగా మూడు కేసులు నమోదు చేయడం సంచలనంగా మారింది. అవినీతి నిరోధక శాఖ అధికారులు లంచం తీసుకున్నప్పుడు రెడ్ హైండెడ్ గా పట్టుకన్నట్టయితే ట్రాప్ కేసులు, ఆదాయానికి మించి ఆస్తులు గడించిన వారిపై దాడులు చేసినట్టయితే అసెట్స్ కేసులు ఎక్కువగా నమోదు చేస్తుంటారు. అయితే ఇప్పుడు ఆర్సీఓ (Registered Case Others) కేసులపై కూడా దృష్టి పెట్టడంతో ఆయా విభాగాల్లో చర్చ మొదలైంది. ఆర్థిక లావాదేవీలు సులువగా చేసుకోవచ్చన్న ధీమాంతో యూపీఐ పేమెంట్స్ చేసుకుంటున్న అధికార యంత్రాంగాన్ని కూడా కట్టడి చేయాలన్న ఆలోచనతో ఏసీబీ ఈ తరహా కేసులపై సీరియస్ గా దృష్టి సారించినట్టుగా స్పష్టం అవుతోంది.
వరస కేసులు…
తాజాగా కరీంనగర్ అవినీతి నిరోధక శాఖ అధికారులు నమోదు చేసిన కేసులను పరిశీలిస్తే లంచం ఏ రూపంలో తీసుకున్నా వదిలిపెట్టేది లేదని చేతల్లోనే చూపిస్తున్నారు. తనకు ఇచ్చే లంచం డబ్బులు నేరుగా తీసుకోకుండా ఓ బినామీ అకౌంట్ ను ఓపెన్ చేశాడు వర్క్స్, అకౌంట్స్ విభాగం జాయింట్ డైరక్టర్ కార్యాలయ ఉద్యోగి ఈగల మధుసూధన్. రూ. 14.77 లక్షల నగదును సదరు అకౌంట్ ద్వారా లావాదేవీలు జరిపినట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. బాధితులు ఏసీబీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో వివరాలు సేకరించి ఈగల్ మదుసూధన్ ను అరెస్ట్ చేశారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ విభాగంలో ఇన్స్ పెక్టర్ గా పని చేస్తున్న గుండేటి రాము గతంలో వేములవాడలో డ్యూటీ చేశారు. అప్పుడు బెల్లం వ్యాపారుల నుండి మామూళ్లు వసూలు చేసుకునేందుకు తన స్నేహితుడు అయిన సెకండరీ స్కూల్ టీచర్ జక్కని వేణు బ్యాంకు అకౌంట్ కు డబ్బులు బదిలీ చేయించుకున్నాడు. ఈ విషయంపై ఫిర్యాదు రావడంతో ఏసీబీ అధికారులు ఎక్సైజ్ ఇన్స్ పెక్టర్ గుండేటి రాముతో పాటు బినామీగా వ్యవహరించిన టీచర్ జక్కని వేణులను అరెస్ట్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ ఎస్సైగా పని చేసి ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో డ్యూటీ చేస్తున్న ఊరుగొండ వెంకటేశ్వర్లు ఇసుక లారీని విడిపించేందుకు కానిస్టేబుట్ సత్యనారాయణ ద్వారా బేరం కుదర్చుకున్నారు. మొదట రూ. 20 వేలు డిమాండ్ చేసి చివరకు రూ. 15 వేలకు ఒప్పందం కుదిరింది. ఈ నగదును యూపీఐ ద్వారా కానిస్టేబుల్ సత్యనారాయణ అకౌంటు కు బదిలీ చేయగా ఈ విషయంపై ఫిర్యాదు అందడంతో ఏసీబీ అధికారులు ఎస్సై ఊరుగొండ వెంకటేశ్వర్లును అరెస్ట్ చేశారు.
ధీమాకు బ్రేక్…
ఇంతకాలం థర్డ్ పార్టీ ద్వారా మామూళ్లు తీసుకుంటూ కాలం వెల్లదీస్తున్న అధికార యంత్రాంగంపై ఏ చిన్న ఫిర్యాదు అందినా ఏసీబీ వదిలి పెట్టేలా లేదని తాజాగా నమోదయిన కేసులు స్పష్టం చేస్తున్నాయి. లంచం డబ్బులు తీసుకునేందుకు తమకు నమ్మకమైన వారి ద్వారా లావాదేవీలు జరిపినా ఏసీబీకి చిక్కక తప్పదన్న విషయాన్ని గుర్తెరగాల్సిందే. తమకు సంబంధం లేదని తప్పించుకునే అవకాశం లేకుండానే ఏసీబీ అధికారులు బినామీ అకౌంట్లు, బినామీ వ్యక్తులకు సంబంధించిన ఆధారాలను సేకరించి మరీ అరెస్ట్ చేస్తోంది. లంచం ఏ రూపంలో తీసుకున్నా ఏసీబీ ఉచ్చులో చిక్కుకోక తప్పదన్న విషయం ఇటీవల కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో నమోదయిన కేసులు చెప్పకనే చెప్తున్నాయి. అవినీతికి పాల్పడి తాము సేఫ్ అయ్యామని నమ్మకంతో ఉన్న ఏ క్షణంలో అయినా ఏసీబీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.